సత్యన్‌ కొత్త చరిత్ర

31 Jan, 2019 00:55 IST|Sakshi

ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానం సాధించిన భారత ప్లేయర్‌గా రికార్డు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ తరఫున ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ర్యాంక్‌ సాధించిన క్రీడాకారుడిగా జ్ఞానశేఖరన్‌ సత్యన్‌ చరిత్ర సృష్టించాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సత్యన్‌ మూడు స్థానాలు ఎగబాకి 28వ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇప్పటివరకు భారత్‌ తరఫున అత్యుత్తమ ర్యాంక్‌ సాధించిన ప్లేయర్‌గా ఆచంట శరత్‌ కమల్‌ (30వ ర్యాంక్‌) పేరిట ఉన్న రికార్డును సత్యన్‌ సవరించాడు. గత ర్యాంకింగ్స్‌లో 30వ స్థానంలో ఉన్న శరత్‌ కమల్‌ మూడు స్థానాలు పడిపోయి 33వ ర్యాంక్‌కు చేరాడు. తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సత్యన్‌ ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నాడు.

గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో సత్యన్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణం, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కాంస్యం, పురుషుల డబుల్స్‌లో రజతం సాధించాడు. ఆస్ట్రియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ ప్లాటినమ్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.  మహిళల సింగిల్స్‌లో మనిక బత్రా టాప్‌–50లోకి స్థానం పొందిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె పది స్థానాలు ఎగబాకి 47వ ర్యాంక్‌కు చేరుకుంది. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో మనిక మహిళల సింగిల్స్, టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.  

మరిన్ని వార్తలు