‘రిషభ్‌పై అంత ప్రేమ అవసరం లేదు’

22 Sep, 2019 17:32 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌  పంత్‌కు పదే పదే అవకాశాలు ఇవ్వడం ఒకటైతే, అతని ఆట తీరును జట్టు మేనేజ్‌మెంట్‌  సమర్ధించడంపై మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ మండిపడ్డాడు. ఇటీవల రిషభ్‌ పంత్‌కు సంజూ శాంసన్‌ నుంచి  సీరియస్‌ సవాల్‌ ఎదురు కానుందని పేర్కొన్న గంభీర్‌.. మరొకసారి పంతే లక్ష్యంగా విమర్శలు సంధించాడు. ‘ పంత్‌ను కొనసాగించండి. అది రెగ్యులర్‌ ఆటగాడిగా కాదు. బ్యాకప్‌గా పెట్టుకోండి. అంతేకాని వరుసగా విఫలం అవుతూ వస్తున్న పంత్‌ను కొనసాగించడం వెనుక ఉద్దేశం ఏమిటి.

దాంతో పాటు రిషభ్‌ ఒక ఫియర్‌లెస్‌’ క్రికెటర్‌ అంటూ మద్దతుగా టీమిండియా మేనేజ్‌మెంట్‌ మద్దతుగా నిలవడం సరైనది కాదు. ఇప్పుడు మీ ఫియర్‌లెస్‌ కాస్తా కేర్‌లెస్‌ అయిపోయాడు. ఒక్కసారి రిషభ్‌ పంత్‌ ఆటను చూడండి. కేవలం స్ట్రోక్‌ ప్లేతో వికెట్లను పేలవంగా జారవిడుచుకుంటున్నాడు. వెస్టిండీస్‌ పర్యటనలో పంత్‌ దారుణంగా  విఫలమైనప్పటికీ అతను ఇంకా కేర్‌ఫుల్‌గా ఆడాలంటూ మద్దతుగా నిలుస్తున్నారు. పంత్‌పై మీకు అంత ప్రేమెందుకు. ఇది ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదు.

ప్రతీ ఒక్కరూ అతను మంచి క్రికెట్‌ ఆడాలని కోరుకుంటారు.  పంత్‌ మాత్రం నిర్లక్ష్యంగా ఔటవుతున్నాడు. పరుగులు చేయడం కంటే జట్టులో ఎలా కొనసాగాలి అనే దాని కోసం మాత్రమే పంత్‌ ఆడుతున్నాడనే విషయం నాకు తెలుసు. నేను వ్యక్తిగతంగా రిషభ్‌ పంత్‌ కంటే కూడా సంజూ శాంసన్‌కే ఓటేస్తా. భారత క్రికెట్‌లో ఇంకా యువ క్రికెటర్లు ఉన్నారు. పంత్‌ ఒక్కడే యువ వికెట్‌ కీపర్‌ కాదు. టీమిండియా మేనేజ్‌మెంట్‌ వ్యాఖ్యలు సంతృప్తికరంగా లేవు’ అని గంభీర్‌ ధ్వజమెత్తాడు.

మరిన్ని వార్తలు