‘జాన్సెన్‌తో ప్రమాదం పొంచి ఉంది’ 

5 Nov, 2023 01:58 IST|Sakshi

(గౌతమ్‌ గంభీర్‌)   :  ఐపీఎల్‌లో కేకేఆర్‌ తరఫున ఆడిన సమయంలో షమీ తలపై జుట్టు ఎక్కువగా ఉండేది. సీనియర్లు సరదాగా గడిపే సమయంలోనూ అతను నిశ్శబ్దంగా ఉంటూ తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. ఎక్కడో అమ్రోహాలాంటి చిన్న పట్టణంనుంచి కెరీర్‌ కోసం షమీ బయటకు వచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌ ప్లేయర్‌ స్టోక్స్‌కు అతను వేసిన స్పెల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాలి.

చక్కటి గుడ్‌ లెంగ్త్‌ బంతులతో అతను కట్టిపడేయగా, స్టోక్స్‌ చిన్న క్లబ్‌ క్రికెటర్‌లా కనిపించాడు. పది బంతులు ఆడినా అతను పరుగు తీయలేకపోయాడు. షమీ తర్వాతి మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించాడు. ఇప్పుడు తన సొంత మైదానం ఈడెన్‌ గార్డెన్స్‌కు అతను తిరిగొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో హోరాహోరీ పోరు ఖాయం. బౌన్స్‌ ఉండే ఇక్కడి పిచ్‌ పేస్‌ బౌలర్లకు అనుకూలిస్తుంది.

భవిష్యత్తులో గొప్ప ఆల్‌రౌండర్‌ కాగల సామర్థ్యం మార్కో జాన్సెన్‌కు ఉంది. తన బౌలింగ్‌తో అతను కోహ్లి, రోహిత్‌లను కూడా ఇబ్బంది పెట్టగలడు. రబడ, ఎన్‌గిడిలాంటి బౌలర్లతో పాటు అద్భుత ఫీల్డింగ్‌ దక్షిణాఫ్రికా సొంతం. జట్టు బ్యాటింగ్‌ను డి కాక్‌ ముందుండి నడిపిస్తున్నాడు. నా లక్నో జట్టు సహచరుడైన డి కాక్‌ ప్రతిభ గురించి ఏనాడూ సందేహం లేదు.
 

మరిన్ని వార్తలు