మహారాజా ఆఫ్‌ విజయనగరం తర్వాత గంగూలీనే

14 Oct, 2019 16:50 IST|Sakshi

న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పగ్గాలు చేపడితే సుమారు ఆరు దశాబ్దాల తర్వాత ఆ పదవి చేపట్టిన తొలి క్రికెటర్‌గా నిలుస్తాడు. గతంలో సునీల్‌ గావస్కర్‌, శివలాల్‌ యాదవ్‌లు తాత్కాలిక అధ్యక్షులిగా మాత్రమే చేయగా, 65 ఏళ్ల క్రితం మహారాజా ఆఫ్‌ విజయనగరంగా పిలవబడే ఏకేఏ విజ్జీ బీసీసీఐ అధ్యక్షుడిగా పూర్తి స్థాయి సేవలందించారు. వివాదాస్పద క్రికెటర్‌గా ముద్ర పడిన  ఏకేఏ విజ్జీ.. 1954-56 కాలంలో బీసీసీఐ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మరో క్రికెటర్‌ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం దాదాపు ఖాయమైంది.

బీసీసీఐ అనుబంధం రాష్ట్ర అసోసియేషన్లలోని మెజార్టీ సభ్యులు గంగూలీ ఎంపికకు ఆమోదం తెలపడంతో అతని నియామకం ఇక లాంఛనమే. ఈ తరుణంలో మహారాజా ఆఫ్‌ విజయనగరం ఏకేఏ విజ్జీ తర్వాత గంగూలీనే బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నక్రికెటర్‌గా అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నాడు. అక్టోబర్‌ 23వ తేదీన బీసీసీఐ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో గంగూలీకి తిరుగులేకుండా పోయింది. ఇప్పటివరకూ చూస్తే రాష్ట యూనియన్ల ప్రతినిధులు ఎక్కువ సంఖ్యలో గంగూలీ వైపే మొగ్గుచూపుతున్నారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఎన్‌ శ్రీనివాసన్‌ బలపరుస్తున్న బ్రిజేష్‌ పటేల్‌కు ఆమోదం తెలిపే సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో గంగూలీ నియామకం అనివార్యమే.

బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా గంగూలీ పదవీ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘ బెంగాల్‌ టైగర్‌ ఈజ్‌ బ్యాక్‌’ అని ఒకరు ప్రశంసించగా, ‘ ఒక ప్లేయర్‌గా, ఒక కెప్టెన్‌గా, ఒక కామెంటేటర్‌గా గంగూలీ సక్సెస్‌ అయ్యాడు.. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముద్ర ఖాయం’ అని మరొకరు ట్వీట్‌ చేశారు.

గంగూలీకి అభినందనలు: మమతా బెనర్జీ
‘బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోయే గంగూలీకి ఇవే తన అభినందనలు. నీ పదవీ కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా. నువ్వు ఇటు భారత్‌ గౌరవాన్ని, బెంగాల్‌ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తిగా ముద్ర వేశావు. క్యాబ్‌ అధ్యక్షుడిగా కూడా నీ సేవలు వెలకట్టలేనివి. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నా’ అని మమత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు