సీఏసీ పదవికి గంగూలీ రాజీనామా?

18 Apr, 2019 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ: పరస్పర విరుద్ధ ప్రయోజనాల వివాదంలో భాగంగా అవసరమైతే బీసీసీఐ సలహాదారు కమిటీ(సీఏసీ) పదవికి రాజీనామా చేసేందుకు మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడేళ్ల క్రితం సచిన్‌ టెండూల్కర్‌, గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌తో కూడిన సీఏసీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుగా ఉన్న గంగూలీ.. సీఏసీ పదవిలో ఎలా కొనసాగుతాడంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై బీసీసీఐకి ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఎదుట గంగూలీ హాజరై తన వాదనను వినిపించనున్నాడు.

అయితే.. క్యాబ్‌ చీఫ్‌, ఢిల్లీ సలహాదారు పదవులు ‘విరుద్ధ’ అంశం కిందకు రావని గంగూలీ అంటున్నాడు. మరోవైపు క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీవోఏ) కూడా గంగూలీ అభిప్రాయాన్ని ఏకీభవించే అవకాశమున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. కానీ, మున్ముందు తన సీఏసీ పదవిపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యే చాన్సుండడంతో తానే ఆ హోదా నుంచి తప్పుకోవాలని గంగూలీ భావిస్తున్నట్టు సమాచారం. అందుకే త్వరలోనే అతను సీఏసీకి గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు