ఇలాగేనా ఆడేది?: గావస్కర్‌

6 Dec, 2018 14:37 IST|Sakshi

అడిలైడ్‌: ఆసీస్‌తో తొలి టెస్టులో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆట తీరుపై దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస‍్కర్‌ ధ‍్వజమెత్తాడు. టీమిండియా తొలి సెషన్‌లోనే కీలక వికెట్లను చేజార్చుకోవడాన్ని గావస్కర్‌ పశ్నించాడు. ప్రధానంగా టీమిండియా టాపార్డర్‌ ఆటగాళ్లు అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతుల్ని వెంటాడి మరీ పెవిలియన్‌కు చేరడాన్ని తప్పుబట్టాడు. ఐదు రోజుల టెస్టులో తొలి సెషన్‌లోనే భారత్‌ వరుసగా వికెట్లను సమర్పించుకోవడానికి పేలవమైన షాట్‌ సెలక్షనే కారణమంటూ విమర్శించాడు.

‘ఒక టెస్టు మ్యాచ్‌కు ఆడేటప్పుడు ఇలాగేనా ఆడేది. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ బంతులకు వికెట్లు సమర్పించుకుంటారా. వదిలేయాల్సిన బంతులపైకి వెళ్లి మరీ వికెట్లు చేజార్చుకోవడమేంటి. కోకోబుర్రా బంతులు కేవలం కొన్ని ఓవర్లు పాటే స్వింగ్‌ కావడానికి సహకరిస్తాయి. అటువంటప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం మానేసి ఇంత నాసిరకంగా ఔటవుతారా. ప్రతీ ఒక‍్కరూ తొలి సెషన్‌లోనే పరుగులు చేయడానికి పోటీ పడి మరీ వికెట్లు కోల్పోయారు. ఇది ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో తొలి సెషన్‌ అనే సంగతినే మరిచారు. టీమిండియా సిరీస్‌ను ఇలా ఆరంభించడం నిజంగానే బాధాకరం’ అని గావస్కర్‌ విమర్శించాడు. మొదటి రోజు ఆటలో లంచ్‌ సమయానికి భారత్‌ జట్టు 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోవడాన్ని గావస‍్కర్‌ ప్రస్తావించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొమ్మిది వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. చతేశ్వర పుజారా(123; 246 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకోవడంతో భారత్‌ రెండొందల మార్కును దాటింది.

పుజారా అరుదైన మైలురాయి..

రోహిత్‌.. ఇలా అయితే ఎలా?

>
మరిన్ని వార్తలు