Aus vs Pak: మూలిగే నక్కమీద తాటిపండు.. పాక్‌కు మరో షాకిచ్చిన ఐసీసీ! ఇక టీమిండియా..

18 Dec, 2023 20:10 IST|Sakshi
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన ఐసీసీ (PC: ICC)

Aus vs Pakistan lose WTC25 Points: ఆస్ట్రేలియా చేతిలో తొలి టెస్టులో ఘోర ఓటమి పాలైన పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. పెర్త్‌ టెస్టులో నిర్దేశిత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి పాక్‌ జట్టుకు జరిమానా విధించింది. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పాయింట్లలో రెండు పాయింట్ల మేర కోత విధించింది.

భారీ ఓటమి
కాగా పాకిస్తాన్‌తో టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం 450 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది పాకిస్తాన్‌. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో 30.2 ఓవర్లలో 89 పరుగులకే కుప్పకూలింది. 

పాక్‌ జట్టులో సౌద్‌ షకీల్‌ (24), బాబర్‌ ఆజమ్‌ (14), ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (10) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. ఆసీస్‌ బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌ (3/31), హాజిల్‌వుడ్‌ (3/13), నాథన్‌ లియోన్‌ (2/14) పర్యాటక జట్టును కోలుకోలేని దెబ్బకొట్టారు.

ఆసీస్‌ చేతిలో మరోసారి ఘోర పరాభవం
దీంతో కంగారూల చేతిలో షాన్‌ మసూద్‌ బృందానికి ఘోర పరాభవం తప్పలేదు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 84/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 5 వికెట్లకు 233 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది.

ఇక తాజా పరాజయంతో ఆస్ట్రేలియా గడ్డపై పాకిస్తాన్‌కిది వరుసగా 15వ ఓటమి కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో చివరిసారిగా 1995లో పాకిస్తాన్‌ టెస్టు మ్యాచ్‌ గెలిచింది. అంతేకాదు.. పరుగుల తేడా పరంగా టెస్టుల్లో పాకిస్తాన్‌కిది రెండో అతిపెద్ద పరాజయం. 

మూలిగే నక్కమీద తాటిపండు
ఇన్ని పరాభవాల మధ్య డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఇప్పటికే టీమిండియాకు కోల్పోయిన పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో తొలి టెస్టులో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా పాక్ ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజులో పది శాతం మేర కోతపడింది. అంతేకాదు.. రెండు డబ్ల్యూటీసీ పాయింట్లు కూడా కోల్పోయింది. దీంతో టీమిండియా అగ్రపీఠాన్ని మరింత పదిలమైంది.


అప్‌డేట్‌ అయిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక PC: ICC

ఈ విషయాన్ని ఐసీసీ సోమవారం వెల్లడించింది. దీంతో పాకిస్తాన్‌ పరిస్థితి మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా తయారైందని క్రికెట్‌ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా- పాకిస్తాన్‌ మధ్య రెండో టెస్టు డిసెంబరు 26న మొదలుకానుంది. అదే రోజు టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ఆరంభించనుంది. 

చదవండి: Ind vs SA: ముఖం మీదే డోర్‌ వేసేశాడు! పాపం రుతురాజ్‌.. వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు