ఆసీస్‌తో ఏకైక టెస్ట్‌.. టీమిండియా డామినేషన్‌

21 Dec, 2023 17:58 IST|Sakshi

స్వదేశంలో (ముంబై) ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌లో తొలి రోజు భారత మహిళా జట్టు డామినేషన్‌ నడించింది. తొలుత బౌలింగ్‌లో ఆసీస్‌ను చుక్కలు చూపించిన టీమిండియా బౌలర్లు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ ప్రతాపం చూపించారు. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్‌ (4/53), స్నేహ్‌ రాణా (3/56), దీప్తి శర్మ (2/45) ధాటికి 77.4 ఓవర్లలో 219 పరుగులకు కుప్పకూలింది.

ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో తహిల మెక్‌గ్రాత్‌ (50) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. బెత్‌ మూనీ (40), అలైసా హీలీ (38), కిమ్‌ గార్త్‌ (28 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 98 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 40 పరుగులు చేసి ఔట్‌ కాగా.. స్మృతి మంధన (43), స్నేహ్‌ రాణా (4) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు టీమిండియా ఇంకా 121 పరుగులు వెనుకపడి ఉంది.

షఫాలీ వర్మ వికెట్‌ జెస్‌ జొనాస్సెన్‌కు దక్కింది. ఆసీస్‌.. ప్రస్తుత భారత పర్యటనలో ఈ టెస్ట్‌ అయిపోయాక 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు ముందు స్వదేశంలోనే ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో భారత్‌ 347 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. అంతకుముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మాత్రం ఇంగ్లండ్‌ 2-1 తేడాతో గెలుచుకుంది.   

>
మరిన్ని వార్తలు