వెస్టిండీస్‌ ఇరగదీసింది..

17 Jun, 2019 18:54 IST|Sakshi

టాంటాన్‌: వరల్డ్‌కప్‌లో వరుస ఓటములతో వెనుకబడిన వెస్టిండీస్‌.. తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో అదరగొట్టింది. విండీస్‌ ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(70; 67 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు), షాయ్‌ హోప్‌(96; 121 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెట్‌ మెయిర్‌(50; 26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు రాణించడంతో పాటు జేసన్‌ హోల్డర్‌(33; 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు 322 పరుగుల టార్గెట్‌ను నిర్దేశిచింది.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో విండీస్‌ బ్యాటింగ్‌ చేపట్టింది. విండీస్‌ ఇన్నింగ్స్‌ను క్రిస్‌ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. అయితే విండీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రిస్‌ గేల్‌ పరుగులేమీ చేయకుండా తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. 13 బంతులాడిన గేల్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దాంతో విండీస్‌ ఆరు పరుగుల వద్ద మొదటి వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో లూయిస్‌కు జత కలిసిన హోప్‌ సమయోచితంగా బ్యాటింగ్‌ చేస్తూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే లూయిస్‌ హాఫ్‌ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 116 పరుగులు భాగస్వామ్యం నమోదు చేసిన తర్వాత లూయిస్‌ రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై నికోలస్‌ పూరన్‌-హోప్‌లు బంగ్లా బౌలింగ్‌పై ఎదురుదాడికి దిగారు.
(ఇక్కడ చదవండి:13 బంతులాడి ఖాతా తెరవకుండానే..!)

కాగా, పూరన్‌(25) భారీ షాట్‌ ఆడే క్రమంలో మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ సమయంలో హోప్‌తో కలిసి హెట్‌ మెయిర్‌ ఇన్నింగ్స్‌ నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఈ జోడి 85 పరుగులు జత చేయడంతో విండీస్‌ స్కోరు బోర్డు మళ్లీ గాడిలో పడింది.  హెట్‌ మెయిర్‌ హాఫ్‌ సెంచరీ సాధించగా, పరుగు వ్యవధిలో ఆండ్రీ రసెల్‌(0) డకౌట్‌ అయ్యాడు. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జేసన్‌ హోల్డర్‌ విండీస్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రెండు భారీ సిక్సర్లు కొట్టి తన ఉద్దేశం ఏమిటో చెప్పాడు. అయితే హోల్డర్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. చివర్లో డారెన్‌ బ్రేవో(19‌; 15 బంతుల్లో 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించడంతో విండీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఈ వరల్డ్‌కప్‌లో విండీస్‌కు ఇదే అత్యధిక స్కోరు. బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, మహ్మద్‌ సైఫుద్దీన్‌ తలో మూడు వికెట్లు సాధించగా, షకీబుల్‌ హసన్‌ రెండు వికెట్లు తీశాడు.


 

మరిన్ని వార్తలు