శ్రీధర్‌ మృతి క్రీడాలోకానికి తీరని లోటు

31 Oct, 2017 10:43 IST|Sakshi

మంచి మిత్రుణ్ని కోల్పోయాను

పౌరసరఫరాల కమిషనర్‌ సీవీ ఆనంద్‌  

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్, భారత జట్టు మాజీ అసిస్టెంట్‌ మేనేజర్‌ ఎం.వి. శ్రీధర్‌ ఆకస్మిక మృతి పట్ల పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ‘శ్రీధర్‌ మరణం క్రీడా లోకానికి, ముఖ్యంగా హైదరాబాద్‌ క్రికెట్‌కు తీరని లోటు. శ్రీధర్‌ వ్యక్తిగతంగా నాకు మంచి మిత్రుడు. ఎప్పుడూ క్రికెట్‌ అభివృద్ధి గురించే ఆలోచించేవాడు. వ్యక్తిగతంగా నాకు తీరని లోటు. అతనితో కలసి ఎన్నో మ్యాచులు ఆడాను. అవి నాకు మరిచిపోలేని అనుభూతులు.

అతి క్లిష్టమైన హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) రాజకీయాలను ఎదుర్కొని మంచి పరిపాలకుడిగా పేరుగాంచారు. శ్రీధర్‌ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ 2013లో జనరల్‌ మేనేజర్‌గా నియమించింది. ఆయన ఆట ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తినిచ్చింది. మాజీ క్రికెటర్‌గానే కాకుండా హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘానికి అతను చేసిన సేవలు నిరుపమానమైనవి. దేశవాళీ మ్యాచుల్లో శ్రీధర్‌ విశేష ప్రతిభ కనబరచినా జాతీయ జట్టులో ఆడే అవకాశం రాలేదు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సీవీ ఆనంద్‌ అన్నారు.


శ్రీధర్ పార్థీవ దేహాన్ని సందర్శించి వస్తున్న మాజీ క్రికెటర్ వెంకటపతి రాజు

మరిన్ని వార్తలు