పరుగు వ్యవధిలో 5 వికెట్లు!

4 Mar, 2018 13:06 IST|Sakshi

షార్జా: క్రికెట్‌ అనేది ఫన్నీ గేమ్‌. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. అందులోనూ టీ 20 క్రికెట్‌ వచ్చిన తర్వాత ఈ గేమ్‌ స్వరూపమే మారిపోయింది. బంతికో ఫోర్‌.. బంతికో వికెట్‌గా అన్న మాదిరిగా టీ 20 ఫార్మాట్‌ తయారైందనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఒక జట్టు పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోవడమే ఇందుకు ఉదాహరణ.

శనివారం క్వెట్టా గ్లాడియేటర్స్‌-ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గ్లాడియేటర్స్ 15.4 ఓవర్లలో 102 పరుగులకు కుప్పకూలింది. 101 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయిన గ్లాడియేటర్స్‌.. మరో పరుగు మాత్రమే చేసి మిగతా వికెట్లను నష్టపోయింది. దాంతో పరుగు వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పోయి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇందులో ముల్తాన్‌ సుల్తాన్స్‌ తరపున ఆడుతున్న దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ తాహీర్‌ హ్యాట్రిక్‌ వికెట్లను సాధించడం మరొక విశేషం. తాహిర్ స్పిన్ దెబ్బకు గ్లాడియేటర్స్‌ విలవిల్లాడుతూ హ్యాట్రిక్‌ను సమర్పించుకుంది. చివరి ఐదు వికెట్లలో మూడు డకౌట్లు ఉండటం గమనార్హం. ఇది పీఎస్‌ఎల్‌ చరిత్రలో మూడో హ్యాట్రిక్‌గా నమోదైంది.

ఆపై 103 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన ముల్తాన్‌ సుల్తాన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.  కుమార సంగక‍్కరా(51 నాటౌట్‌), షోయబ్‌ మస్జూద్‌(26 నాటౌట్‌), అహ్మద్‌ షెహజాద్‌(27)లు తమ జట్టు ఘన విజయానికి సహకరించారు.

 

మరిన్ని వార్తలు