ముగిసిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌!

16 Dec, 2018 11:39 IST|Sakshi

ఆసీస్‌కు 43 పరుగుల ఆధిక్యం 

5 వికెట్లతో చెలరేగిన లయన్‌

పెర్త్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 283 పరుగులకు ముగిసింది. 172/3 ఓవైర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన.. ఆదిలోనే అజింక్యా రహానే (51:105 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన తెలుగు తేజం హనుమ విహారితో కోహ్లి ఆచితూచి ఆడుతూ.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 214 బంతుల్లో 11 ఫోర్లతో కోహ్లి కెరీర్‌లో 25వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజులో పాతుకుపోతున్న ఈజోడిని హజల్‌వుడ్‌ దెబ్బతీశాడు. హనుమ విహారి(26)ను క్యాచ్‌ ఔట్‌గా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 5వ వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

కోహ్లి ఔట్‌.. టీమిండియా ప్యాకప్‌..
థర్డ్‌ అంపైర్‌ తప్పుడు నిర్ణయానికి కోహ్లి బలవ్వడంతో భారత్ వికెట్లను చకచకా కోల్పోయింది. కమిన్స్‌ వేసిన 93వ ఓవర్‌ చివరి బంతి కోహ్లి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని సెకండ్‌ స్లిప్‌లో ఉన్న హ్యాండ్స్‌కోంబ్‌ చేతిలో పడింది. అయితే బంతి మాత్రం నేలకు తాకిన సమయంలోనే ఫీల్డర్‌ చేతిలో పడినట్లు రిప్లేలో కనబడింది. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ షమీ గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. చివరల్లో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన పంత్‌.. టేలండర్ల సాయంతో 27 పరుగులు జోడించాడు. నాథన్‌ లయన్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన పంత్‌ (36) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. చివరి వికెట్‌గా బుమ్రా ఔటవ్వడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. 5 వికెట్లతో స్పిన్నర్‌ లయన్‌ భారత బ్యాట్స్‌మన్‌ పతనాన్ని శాసించాడు. స్టార్క్‌, హజల్‌వుడ్‌లకు రెండేసి వికెట్లు దక్కగా.. కమిన్స్‌కు ఒక వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు