వారికి కష్టాలు తప్పవు: కుంబ్లే

22 Jun, 2018 14:39 IST|Sakshi

చెన్నై: త్వరలో టీమిండియాతో జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో ఇంగ్లండ్‌ జట్టుకు కష్టాలు తప్పవని అంటున్నాడు మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే. అత్యంత అనుభవమున్న టీమిండియాను ఎదుర్కోవడం ఇంగ్లండ్‌ అంత సులభం కాదని కుంబ్లే స్పష్టం చేశాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ విభాగాల్లో చూస్తే భారత క్రికెట్‌ జట్టే అత్యుత్తమంగా ఉందన్నాడు. ప్రధానంగా భారత స్పిన్నర్ల నుంచి ఇంగ్లండ్‌కు ముప్పు పొంచి వుందని కుంబ్లే జోస్యం చెప్పాడు.

‘అన్ని విభాగాల్లో టీమిండియా జట్టే అత్యుత్తమం. ముఖ్యంగా టెస్టుల్లో 20 వికెట్లను తీసే బౌలర్లు మన జట్టులో ఉన్నారు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో అనుభవంతో కూడిన జట్టు మనది. కనీసం 50 టెస్టులు ఆడిన ఆటగాళ్లు భారత జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్‌ గడ్డపై ఆడిన అనుభవం దాదాపు అందరికీ ఉంది. ఇది మనకు అదనపు ప్రయోజనం. ఉత్తమ స్సిన్నర్లు టీమిండియా సొంతం. సెకాండాఫ్‌లో స్పిన్నర్లు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు సిరీస్‌ గెలవడానికి దోహదం చేస్తుంది’ అని ఒక ఈవెంట్‌లో పాల్గొనడానికి నగరానికి వచ్చిన కుంబ్లే పేర్కొన్నాడు.

జూలై 3వ తేదీ నుంచి ఇంగ్లండ్‌-భారత జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు, ఐదు టెస్టులు ఆడనుంది.

మరిన్ని వార్తలు