మొగ్గు మన వైపే!

9 Dec, 2018 00:08 IST|Sakshi

166 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

రాణించిన రాహుల్, పుజారా, కోహ్లి

ఆస్ట్రేలియా 235 ఆలౌట్‌

ప్రత్యర్థిని మన స్కోరు దాటకుండా చేసి, తక్కువే అయినా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని పొందిన టీమిండియా... దానిపై ఒక్కో పరుగూ పేర్చుకుంటూ పోతోంది. పిచ్‌ అంతకంతకూ నెమ్మదిస్తుండగా... కంగారూలకు కఠిన సవాల్‌ లాంటి లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ప్రయత్నిస్తోంది. ఆస్ట్రేలియాను ఆత్మ రక్షణలోకి నెట్టి... అడిలైడ్‌ టెస్టును వశం చేసుకునే దిశగా కదులుతోంది. ఆతిథ్య జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడాల్సిన స్థితిలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ దూకుడైన ఆరంభాన్నివ్వగా, పుజారా మరోసారి గోడ కట్టాడు. అతడికి కెప్టెన్‌ కోహ్లి అండగా నిలిచాడు. పరిస్థితుల ప్రకారం చూస్తే ఇప్పటికే సురక్షిత స్థితిలో ఉన్నందున... చేయాల్సింది మ్యాచ్‌ను క్రమంగా లాగేసుకోవడమే. మధ్యలో వరుణుడు అడ్డుపడితేనో... పైన్‌ బృందం వీరోచితంగా పోరాడితేనో తప్ప... ఇప్పటికైతే మొగ్గంతా టీమిండియా వైపే!  

అడిలైడ్‌: చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ మొట్టమొదటి టెస్టులోనే విజయం సాధించే దిశగా టీమిండియా అడుగులేస్తోంది. సాధికారికంగా ఆడుతూ కంగారూలపై పూర్తి పైచేయి సాధించింది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో శనివారం ఓపెనర్‌ రాహుల్‌ (67 బంతుల్లో 44; 3 ఫోర్లు, 1 సిక్స్‌) జోరు, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ పుజారా (40 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) ఓర్పు,  కోహ్లి (34; 3 ఫోర్లు) తోడ్పాటుతో రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులతో నిలిచింది. చేతిలో ఏడు వికెట్లుండగా, 166 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు బిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 191/7తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆస్ట్రేలియా 235 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు స్కోరుకు 11 పరుగులు జోడించిన ట్రావిస్‌ హెడ్‌ (72)తో పాటు హాజల్‌వుడ్‌ (0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేసిన షమీ ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు తెరదించాడు. దీంతో భారత్‌కు 15 పరుగుల ఆధిక్యం దక్కింది. మూడో రోజు వర్షం కారణంగా రెండుసార్లు  ఆటకు అంతరాయం కలిగింది.  

దగ్గరగా వచ్చింది... కానీ 
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ శనివారం 10.4 ఓవర్లపాటు సాగింది. ఈ వ్యవధిలోనే ఆ జట్టు 44 పరుగులు చేసింది. స్టార్క్‌ (15)ను బుమ్రా త్వరగానే పెవిలియన్‌ పంపినా, నాథన్‌ లయన్‌ (24 నాటౌట్‌; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆందోళన కలిగించాడు. హెడ్‌తో కలిసి 9వ వికెట్‌కు 31 పరుగులు జోడించాడు. అయితే, షమీ చక్కటి బంతితో హెడ్‌ను ఔట్‌ చేసి భాగస్వామ్యాన్ని విడదీశాడు. 

రెండు జంటలు... 134 పరుగులు 
జట్టు పరిస్థితి కంటే వ్యక్తిగత ఫామ్‌ కారణంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న భారత ఓపెనర్లు మురళీ విజయ్‌ (18), రాహుల్‌  రెండో ఇన్నింగ్స్‌లో శుభారంభం అందించారు. దీంతో తొలి వికెట్‌కు 63 పరుగులు సమకూరాయి. సహజ శైలిలో కనిపించిన విజయ్‌... స్టార్క్‌ బౌలింగ్‌లో డ్రైవ్‌ చేయబోయి ఔటయ్యాడు. కాసేపటికే రాహుల్‌ దూకుడుకు హాజల్‌వుడ్‌ తెరదించాడు. టీకి కొద్దిగా ముందు జత కలిసిన పుజారా, కోహ్లి పూర్తి నియంత్రణతో ఆడారు. లయన్‌ బౌలింగ్‌లో పుజారా ఎల్బీ అయినట్లుగా అంపైర్‌ ప్రకటించినా, సమీక్షలో నాటౌట్‌గా తేలింది. వీరిద్దరూ మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఊపుమీదున్న దశలో కోహ్లిని ఔట్‌ చేసి లయన్‌ దెబ్బకొట్టాడు. రహానే (1 బ్యాటింగ్‌) తోడుగా పుజారా మరో నాలుగు ఓవర్లు ఎదుర్కొని రోజును ముగించాడు. 

కోహ్లి... హి...హి..హి... 
తొలుత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సందర్భంగా, తర్వాత బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు, అనంతరం ఔటైన సందర్భంలో... ఇలా అడిలైడ్‌ టెస్టులో శనివారం భారత కెప్టెన్‌  కోహ్లి పేరు పదేపదే చర్చనీయాంశమైంది. వాతావరణం ఉల్లాసంగా ఉన్న కారణంగానో ఏమో, ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఫీల్డింగ్‌లో ఉన్న కోహ్లి డ్యాన్స్‌ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇక అతడు క్రీజులోకి వస్తుండగా అభిమానులు పెద్దఎత్తున శబ్దం చేశారు. షార్ట్‌ లెగ్‌లో ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చి అతడు ఔటై వెనుదిరుగుతుండగా... డిఫెన్స్‌ అలా కాదు... ఇలా ఆడాలన్నట్లు స్పిన్నర్‌ లయన్‌ సంజ్ఞలు చేసి చూపాడు.  

పంత్‌... రికార్డు ‘పట్టేశాడు’ 
కంగారూల తొలి ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు అందుకుని... భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తొలి ఆస్ట్రేలియా పర్యటనలోనే రికార్డును పట్టేశాడు. తద్వారా ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు (6) అందుకున్న భారత వికెట్‌ కీపర్‌గా మహేంద్ర సింగ్‌ ధోని పేరిట ఉన్న రికార్డును పంత్‌ సమం చేశాడు. శుక్రవారం ఖాజా, హ్యాండ్స్‌కోంబ్, పైన్‌... శనివారం హెడ్, స్టార్క్, హాజల్‌వుడ్‌ ఇచ్చిన క్యాచ్‌లను పంత్‌ పట్టాడు. 2009 న్యూజిలాండ్‌ పర్యటనలో వెల్లింగ్టన్‌ టెస్టులో ధోని 6 క్యాచ్‌లు అందుకున్నాడు.  

మరిన్ని వార్తలు