భారత్‌ మరో ఘనవిజయం

4 Jun, 2018 10:13 IST|Sakshi

కౌలాలంపూర్‌: మహిళల ఆసియాకప్‌ టీ20 టోర్నీలో భారత్‌ మరో ఘనవిజయాన్ని సాధించింది. ఆదివారం మలేసియాతో జరిగిన మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ గ్యాంగ్‌.. సోమవారం థాయ్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత మహిళలు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 132 పరుగులు సాధించారు.  భారత ఓపెనర్లు మోనా మెష్రామ్‌(32), స్మృతీ మంధాన(29) శుభారంభాన్నివ్వగా, అనుజా పటేల్‌(22), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(27 నాటౌట్‌) సమయోచితంగా బ్యాటింగ్‌ చేశారు. దాంతో భారత జట్టు 133 పరుగుల లక్ష్యాన్ని థాయ్‌లాండ్‌కు నిర్దేశించింది.

అయితే లక్ష్య ఛేదనలో థాయ్‌లాండ్‌ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 66 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. థాయ్‌లాండ్‌ క్రీడాకారిణుల్లో నటయా బూచాథామ్‌(21)దే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఆ తర్వాత చాయ్‌వాయ్‌(14), సుధిరువాంగ్‌(12)లే రెండంకెల స్కోరును దాటారు. భారత బౌలర్లలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మూడు వికెట్లతో రాణించగా, దీప్తిశర్మ రెండు వికెట్లు సాధించారు. పూనమ్‌ యాదవ్‌, పూజా వస్త్రాకర్‌లకు తలో వికెట్‌ దక్కింది.

>
మరిన్ని వార్తలు