టీమిండియా వన్డే చరిత్రలోనే..

31 Jan, 2019 11:46 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో టీమిండియా చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 212 బంతులు మిగిలి ఉండగానే ఓటమిని చవిచూసింది. ఫలితంగా వన్డే చరిత్రలో బంతులు పరంగా చూస్తే టీమిండియాకు ఇదే ఘోర పరాజయం.  అంతకుముందు 2010లో దంబాల్లాలో శ్రీలంకపై 209 బంతులు ఉండగా ఓటమి చవిచూసిన భారత్‌.. ఆపై ఇంతకాలానికి అంతకంటే పెద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. భారత్‌ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కాగా, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాను ఒక రికార్డు ఊరించింది. ఇందులో గెలిస్తే న్యూజిలాండ్‌ పర్యటనలో అతిపెద్ద సిరీస్‌ విజయాన్ని సాధించేది. 1967 నుంచి కివీస్‌ పర్యటనకు వెళుతున్న టీమిండియా ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే 3-1 తేడాతో అతిపెద్ద  సిరీస్‌ విజయాన్ని అందుకుంది.  2008-09 పర్యటనలో టీమిండియా మూడు వన్డేల్లో గెలిచి ఆ జట్టుపై సిరీస్‌ను సాధించింది. ఇదే ఇప్పటివరకూ భారత్‌కు అక్కడ అత్యుత్తమ వన్డే ప్రదర్శన. ఇదిలా ఉంచితే ఈ సిరీస్‌లో ఇంకా వన్డే ఉండటంతో ఆ రికార్డును భారత్‌ సాధించేందుకు మరొక అవకాశం మిగిలి ఉంది. ఆదివారం ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే జరుగనుంది.  

నాల్గో వన్డేలో భారత్‌ చిత్తు చిత్తుగా ఓడింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 92 పరుగులకు ఆలౌటైంది.  ఆపై కివీస్‌ 8 వికెట్ల  తేడాతో భారత్‌పై విజయం సాధించింది. కివీస్‌ 39 పరుగులకే మార్టిన్‌ గప్టిల్‌(14), కేన్‌ విలియమ్సన్‌(11)ల వికెట్లను చేజార్చుకున‍్నప్పటికీ, నికోలస్‌(30 నాటౌట్‌), రాస్‌ టేలర్‌(37 నాటౌట్‌)లు జట్టుకు ఘన విజయాన్ని అందించారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్‌ 30.5 ఓవర్లలో 92 పరుగులకు ఆలౌటైంది.  కివీస్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(5/21), గ్రాండ్‌ హోమ్‌(3/26) పదునైన బౌలింగ్‌కు  విలవిల్లాడిన భారత బ్యాట్స్‌మెన్‌ వరుస వికెట్లను చేజార్చుకుని స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు.

మరిన్ని వార్తలు