సీఎస్‌కే అదుర్స్‌

23 Mar, 2019 23:12 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌-12వ సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ అదుర్స్‌ అనిపించింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ ఆకట్టుకున్న చెన్నై ఘన విజయం సాధించింది. తొలుతు ఆర్సీబీ 70 పరుగులకే కట్టడి చేసిన సీఎస్‌కే.. ఆపై లక్ష్యాన్ని 17.4 ఓవర్లలో ఛేదించింది. ఆర్సీబీ నిర్దేశించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆదిలోనే షేన్‌ వాట్సన్‌ వికెట్‌ను కోల్పోయింది. అటు తర్వాత అంబటి రాయుడు-సురేశ్‌ రైనాలు కుదురుగా బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ 32 పరుగుల జోడించిన తర్వాత రైనా(19) భారీ షాట్‌కు యత్నించి రెండో వికెట్‌గా ఔటయ్యాడు. అనంతరం అనవసరపు షాట్‌కు యత్నించి సిరాజ్‌ బౌలింగ్‌లో రాయుడు(28) బౌల్డ్‌ అయ్యాడు. ఆపై రవీంద్ర జడేజా, కేదర్‌ జాదవ్‌ల జోడి మరో వికెట్ పడకుండా ఆడి చెన్నైకు విజయాన్ని అందించారు. ఆర్సీబీ బౌలర్లలో చహల్‌, సిరాజ్‌, సైనీలు తలో వికెట్‌ సాధించారు. 

అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌(29) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయడంలో విఫలం కావడంతో ఆర్సీబీ మూడంకెల మార్కును చేరలేకపోయింది. విరాట్‌ కోహ్లి(6), మొయిన్‌ అలీ(9), ఏబీ డివిలియర్స్‌(9) హెట్‌మెయిర్‌(0), శివం దుబే(2), గ్రాండ్‌ హోమ్‌(4)లు తీవ్రంగా నిరాశపరచడంతో ఆర్సీబీ తిరిగి తేరుకోలేకపోయింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో హర్బజన్‌ సింగ్‌ మంచి బ్రేక్‌ ఇచ్చాడు. తొలి మూడు వికెట్లు సాధించి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. అతనికి జతగా ఇమ్రాన్‌ తాహీర్‌ మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. డ్వేన్‌ బ్రేవోకు వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు