‘మార్చి 28న వద్దే వద్దు’

21 Dec, 2019 17:47 IST|Sakshi

కోల్‌కతా :  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ 13 ప్రారంభ తేదీపై గందరగోళం ఏర్పడింది. ముందుగా అనుకున్న ప్రకారం మార్చి 28 నుంచి ఐపీఎల్‌-2020 ప్రారంభించాలని గవర్నింగ్‌ కౌన్సిల్ భావించింది. అయితే దీనిపై ఎనిమిది ఫ్రాంచైజీలు గుర్రుగా ఉన్నాయంట. అంతేకాకుండా ప్రారంభ తేదీని ఏప్రిల్‌ 1కి మార్చాలని ప్రాంఛైజీలు డిమాండ్‌ చేస్తున్నాయని సమాచారం. దీంతో గవర్నింగ్‌ కౌన్సిల్‌ భేటీలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రారంభ తేది మార్పుపై అన్ని ఫ్రాంచైజీలు పట్టుపట్టడానికి అనేక కారణాలు ఉన్నాయని ఓ ఫ్రాంచైజీకి చెందిన సీనియర్‌ అధికారి తెలిపారు. 

‘ఆస్ట్రేలియా-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగే టీ20 సిరీస్‌ మార్చి 29న, అదేవిధంగా ఇంగ్లండ్‌-శ్రీలంక జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌ మార్చి 31న ముగియనున్నాయి. దీంతో ఈ నాలుగు జట్లకు సంబంధించిన క్రికెటర్లు ఏప్రిల్‌ 1వరకు ఐపీఎల్‌ జట్లతో చేరరు. అంతేకాకుండా వచ్చిన వెంటనే ధనాధన్‌ ఆట ఆడాలంటే వారిపై అధిక శ్రమ భారం పడుతుంది. దీంతో కొన్ని మ్యాచ్‌లను లేక కొన్ని రోజులైన వారికి విశ్రాంతి నివ్వాలి. అనుకున్న తేదీ ప్రకారమే మ్యాచ్‌లు ప్రారంభమైతే ఈ నాలుగు దేశాల క్రికెటర్లు ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లు ఆడలేరు. దీంతో మాకు ఆట పరంగా, అంచనాల పరంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 

అంతేకాకుండా ఈ నష్టం తమకే కాకుండా ఐపీఎల్ కళ దెబ్బతింటుంది. ఎందుకంటే ఐపీఎల్‌లో ఆ నాలుగు దేశాలకు చెందిన క్రికెటర్లే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక అదే ఏప్రిల్‌ 1 నుంచి  ఐపీఎల్‌ ప్రారంభమైతే కేవలం తొలి మ్యాచ్‌కు మాత్రమే వారు దూరమవుతారు. దీంతో పెద్దగా నష్టం జరగదు. ఇదే విషయాన్ని గవర్నింగ్‌ కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లాం. అయితే ఈ అంశంపై త్వరలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు’అని ఆ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు