‘వీహెచ్‌ మానసిక పరిస్థితి సరిగ్గా లేదనుకుంటా’

15 Jul, 2018 10:04 IST|Sakshi

 హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్‌ వాగ్బాణాలు  

హైదరాబాద్‌: అంబర్‌పేట్‌ క్రికెట్‌ క్లబ్‌ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపు కుంటున్నారని హెచ్‌సీఏ అధ్యక్షుడు జి. వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్‌సీఏ నుంచి రూ. 12 కోట్లు... విశాక ఇండస్ట్రీస్‌ తీసుకుందన్న వీహెచ్‌ ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని అసహనం వ్యక్తం చేశారు. శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వీహెచ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వీహెచ్‌ మానసిక పరిస్థతి సరిగ్గా లేదంటూ వాగ్బాణాలు విసిరారు. ‘వీహెచ్‌ ఆరోపణలన్నీ నిరాధారమైనవి. విశాక ఇండస్ట్రీస్‌ డబ్బు తీసుకుందనడంలో నిజం లేదు.

2004లో స్టేడియం కట్టే సమయంలో విశాక ఇండస్ట్రీస్‌ నుంచి రూ. 4.32 కోట్లు స్పాన్సర్‌షిప్‌ చేశాం.  2011లో అర్షద్‌ ఆయూబ్‌ మా అగ్రిమెంట్‌ను అక్రమంగా రద్దు చేశారు. దీనిపై మేము ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌లో అప్పీల్‌ చేస్తే... హెచ్‌సీఏ రూ. 25.92 కోట్లు విశాకకు పెనాల్టీగా ఇవ్వాలని ఆర్బిట్రేషన్‌ తీర్పునిచ్చింది. కానీ తర్వాత జరిగిన ఎస్‌జీఎంలో విశాకతో వివాదాన్ని కోర్టు బయట తేల్చుకోవాలని నిర్ణయించుకున్న హెచ్‌సీఏ... అందుకు అనుగుణంగా వ్యవహరించింది. అప్పటి హెచ్‌సీఏ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ సివిల్‌ కోర్టు జడ్జి ఎదుట విశాకతో తమ వివాదం ముగిసిందంటూ మెమో సమర్పించాడు. ఇందుకు ప్రతిఫలంగా విశాకకు రూ. 17.50 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు ఆ మెమోలో పేర్కొన్నాడు. కానీ ఇప్పటివరకు చిల్లిగవ్వ కూడా హెచ్‌సీఏ నుంచి విశాకకు అందలేదు’ అని ఆయన వివరించారు. హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి పోటీపడిన అజహరుద్దీన్, కార్యదర్శి శేష్‌ నారాయణ్, మాజీ అధ్యక్షుడు అర్షద్‌ ఆయూబ్, మాజీ కార్యదర్శి జాన్‌ మనోజ్‌ అందరిపై కేసులున్నాయని... వీరంతా తనను విమర్శిస్తున్నారని వివేక్‌ మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు