‘అతడి గాయంపై ఆందోళన అక్కర్లేదు’

20 Jun, 2019 20:39 IST|Sakshi

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అన్ని జట్లను గాయాల బెడద వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు క్రికెటర్లు గాయాల కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక వరుస విజయాలతో దూసుకపోత్ను టీమిండియాకు కూడా ఆటగాళ్ల గాయాలు తలనొప్పిగా మారింది. స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గాయం కారణంగా ప్రపంచకప్‌ మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. పేసర్‌ భువనేశ్వర్‌ తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ గాయపడటం టీమిండియాను, అభిమానులను తెగ కలవరానికి గురిచేస్తోంది. 

టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ కోసం గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొంది. అయితే నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా జస్‌ప్రీత్‌ బుమ్రా విసిరిన యార్కర్‌ను అడ్డుకోబోయిన శంకర్‌ విఫలమయ్యాడు. దీంతో బంతి నేరుగా అతడి పాదాన్ని బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడిపోయాడు. అయితే వెంటనే  ఫిజియే ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. అయితే శంకర్‌ గాయంపై స్పందించిన బుమ్రా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు.  

‘మేము బ్యాట్స్‌మన్‌కు గాయం కావాలని కోరుకోము. కానీ కొన్ని సందర్బాల్లో అలా జరుగుతాయి. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తుంటే బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్‌కు చేయాలని మాత్రమే ఆలోచిస్తాం. కానీ అతడికి గాయం కావాలని అనుకోం. ఎవరూ కూడా ఆ బంతికి గాయం అవుతుందని ముందే అంచనా వేయలేరు. శంకర్‌కు అనుకోకుండా నా బౌలింగ్‌లో గాయం అయింది. కానీ అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు’అంటూ బుమ్రా వివరించాడు. ఇక టీమిండియా తన తదుపరి మ్యాచ్‌ అప్గానిస్తాన్‌తో శనివారం తలపడనుంది.

చదవండి:
ధావన్‌ వీడియోపై స్పందించిన మోదీ
ఆరెంజ్‌ జెర్సీలో కోహ్లి సేన!

>
మరిన్ని వార్తలు