మహిళల సీనియర్‌ క్రికెట్‌ జట్టులో జెమీమా

11 Jan, 2018 00:45 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ మహిళల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న యువ సంచలనం జెమీమా రోడ్రిగ్స్‌ భారత సీనియర్‌ మహిళల క్రికెట్‌ జట్టుకు తొలిసారి ఎంపికైంది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో పాల్గొననున్న మహిళల జట్టులో 17 ఏళ్ల ఈ ముంబై అమ్మాయి చోటు దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. 13 ఏళ్ల వయసులోనే అండర్‌–19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా రోడ్రిగ్స్‌ అక్కడ సత్తా చాటి వెలుగులోకి వచ్చింది.  

ఇప్పటికే పలు టోర్నీల్లో సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో ఆకట్టుకుంటున్న జెమీమాను ఇటీవలే బంగ్లాదేశ్‌ ‘ఎ’తో జరిగిన సిరీస్‌కు ఎంపిక చేశారు. ఆ సిరీస్‌లోనూ ఆమె రాణించడంతో సీనియర్‌ వన్డే జట్టులో స్థానం కల్పించారు. గతేడాది ప్రపంచకప్‌లో భారత్‌ను రన్నరప్‌గా నిలబెట్టిన హైదరాబాద్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించారు. భారత మహిళల జట్టు ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా వెళ్లనుంది. అక్కడ మూడు వన్డేలతో పాటు 5 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. కాగా ప్రస్తుతం వన్డే జట్టును మాత్రమే ప్రకటించారు.  

>
మరిన్ని వార్తలు