మొదట్నుంచి భారతే ఫేవరెట్‌: పాక్‌ క్రికెటర్‌

9 Jul, 2019 20:57 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌-2019లో తన ఫేవరేట్‌ జట్టు టీమిండియానేనని పాకిస్తాన్‌ వెటరన్‌ కీపర్‌ కమ్రాన్‌ ఆక్మల్‌ తెలిపాడు. బుధవారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌తో కోహ్లి సేననే విజయం సాధించాలని ఆకాంక్షించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో టీమిండియా సమతూకంగా ఉందన్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు భీకర ఫామ్‌లో ఉన్నారని పేర్కొన్నాడు. ప్రపంచకప్‌ ఆరంభం నుంచి భారత్‌ జట్టే తనకు ఫేవరెట్‌ అని స్పష్టం చేశాడు. ఈ మేరకు భారత్‌- కివీస్‌ జట్లకు ఆల్‌ ద బెస్ట్‌ చెబుతూ కమ్రాన్‌ ట్వీట్‌ చేశాడు. 

ఇక పాకిస్తాన్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడం నిరాశ కలిగించిందని కమ్రాన్‌ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో పాక్‌ ఆటగాళ్లు చాలా ఆలస్యంగా మెలుకున్నారని విమర్శించాడు. ఆది నుంచి ఆటగాళ్లు ఒళ్లు దగ్గరపెట్టుకొని ఆడితే పాక్‌ సెమీస్‌లో ఉండేదని అభిప్రాయపడ్డాడు. న్యూజిలాండ్‌, పాక్‌ సమాన విజయాలు సాధించినప్పటికీ రన్‌రేట్‌ ఆధారంగా సెమీస్‌కు కివీస్‌ చేరింది. ఇక వెస్టిండీస్‌ మ్యాచే పాక్‌ కొంముంచిందని సారథి సర్ఫరాజ్‌ అహ్మద్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఓటమిపై ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరంలేదని, శక్తి మేర పోరాడమని వివరించాడు. 

మరిన్ని వార్తలు