‘టాప్‌’పైనే సీఎస్‌కే గురి

5 May, 2019 15:54 IST|Sakshi

మొహలీ: ఐపీఎల్‌-12వ సీజన్‌లో భాగంగా లీగ్‌ దశ నేటితో ముగియనుంది. లీగ్‌ దశలో ఇంకా రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో ఐఎస్‌ బింద్రా స్టేడియం వేదికగా కింగ్స్‌ పంజాబ్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన కింగ్స్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవి చంద్రన్‌ అశ్విన్‌.. చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

ఇప్పటికే సీఎస్‌కే ప్లేఆఫ్‌కు చేరడంతో ఆ జట్టుకు ఇది అంత ముఖ్యమైన మ్యాచ్‌ కాదు. కానీ పాయింట్ల పట్టికలో టాప్‌తో ముగించాలని భావిస్తున్న చెన్నై మరో విజయంపై కన్నేసింది.  ప్రస్తుత మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే టాప్లే ప్లేస్‌లోనే ఉంటుంది. మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ దాదాపు ప్లేఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించింది. కాగా, సొంత మైదానంలో జరిగే మ్యాచ్‌ కావడంతో విజయంతో వీడ్కోలు పలకాలని భావిస్తోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 22 పరుగుల తేడాతో విజయం సాధించింది.

సీఎ‍స్‌కేను ఆపతరమా..?

వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతున్న సీఎస్‌కేను చివరి స్థానంలో ఉన్న కింగ్స్‌ పంజాబ్‌ నిలువరించడం కష్టమే. సీఎస్‌కే జట్టులో కెప్టెన్‌ ధోని కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతుండగా, డు ప్లెసిస్‌, సురేశ్‌ రైనా, వాట్సన్‌లు బ్యాటింగ్‌ విభాగంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో పేసర్‌ దీపక్‌ చాహర్‌తో పాటు స్పిన్నర్లు ఇమ్రాన్‌ తాహిర్‌, హర్భజన్‌ సింగ్‌లు రాణిస్తున్నారు. మరొకవైపు కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ మెరుపులు ఈ ఐపీఎల్‌లో పెద్దగా లేవనే చెప్పాలి. గేల్‌ క్రీజ్‌లో కుదురుకునే లోపే ప్రత్యర్థి బౌలర్లకు చిక్కడం పంజాబ్‌ వరుస ఓటములకు ఒక కారణం. కేఎల్‌ రాహుల్‌, మన్‌దీప్‌ సింగ్‌, మయాంక్‌ అగర్వాల్‌లు తప్ప మిగతా వారంతా తమ స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న సీఎస్‌కేను కింగ్స్‌ పంజాబ్‌ ఎంతవరకూ నిలువరిస్తుందో చూడాలి.

సీఎస్‌కే మ్యాచ్‌
ఎం​ఎస్‌ ధోని(కెప్టెన్‌), డుప్లెసిస్‌, షేన్‌ వాట్సన్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చాహర్‌, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహిర్‌

కింగ్స్‌ పంజాబ్‌
రవిచంద్రన్‌ అశ్విన్‌(కెప్టెన్‌), క్రిస్‌ గేల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, నికోలస్‌ పూరన్‌, మన్‌దీప్‌ సింగ్‌, సామ్‌ కరన్‌, హరప్రీత్‌ బ్రార్‌, ఆండ్రూ టై, మురుగన్‌ అశ్విన్‌, మహ్మద్‌ షమీ

>
మరిన్ని వార్తలు