అందుకే ఫాలో ఆన్‌ ఆడించలేదు: కోహ్లి

1 Jan, 2019 10:56 IST|Sakshi

మెల్‌బోర్న్‌: మూడో టెస్టులో ఆసీస్‌ను ఫాలో ఆన్‌ ఆడించకపోవడంపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వివరణ ఇచ్చాడు. తాము వెంటనే బ్యాటింగ్‌కు దిగడానికి కారణం ఆసీస్‌ బౌలర్లకు విశ్రాంతి ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే అలా చేసినట్లు పేర్కొన్నాడు. ప్రధానంగా బోర్డుపై 400 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించి ఆసీస్‌పై ఒత్తిడి తీసుకురావాలనేది మరొక కారణమన్నాడు.

‘మేము ఎక్కువ సేపు ఫీల్డింగ్‌ చేయదలుచుకోలేదు. ఆసీస్‌ ఫాలో ఆన్‌ ఆడే క‍్రమంలో మా ఆటగాళ్లు ఎక్కువ సేపు ఫీల్డింగ్‌ చేస్తే అలసిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆసీస్‌ పుంజుకుని మా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని తగ్గించి పైచేయి సాధిస్తే మా బ్యాటింగ్‌ లైనప్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఆసీస్‌కు సాధ్యమైనంత ఎక్కువ లక్ష్యం నిర్దేశించి వారిపై ఒత్తిడి పెంచడం మా వ్యూహంలో భాగం. దాన్నే అమలు చేశాం. ఒకవేళ ఫాలో ఆన్‌ ఆడిస్తే మా బౌలర్లు సైతం అలసిపోవడం ఖాయం. అందుచేత ఆసీస్‌ను ఫాలో ఆన్‌ ఆడించలేద’ని కోహ్లి తెలిపాడు. భారత్-ఆసీస్‌ జట్ల మధ్య గురువారం నుంచి సిడ్నీ వేదికగా చివరిదైన నాల్గో టెస్టు జరుగనుంది.

మరిన్ని వార్తలు