లబూషేన్‌ @ 1000 నాటౌట్‌

14 Dec, 2019 16:41 IST|Sakshi

సహస్ర ధీరుడు..లబూషేన్‌

పెర్త్‌: లబూషేన్‌.. ఇప్పుడు ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు గుండె చప్పుడు. పరుగుల మోత మోగిస్తూ దిగ్గజ క్రికెటర్లనే మైమరిపిస్తున్నాడు. గతేడాది అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసినా, అతని లైఫ్‌ వచ్చింది మాత్రం ఈ ఏడాది జరిగిన యాషెస్‌ సిరీస్‌ అనే చెప్పాలి. యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ గాయపడటంతో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా  వచ్చి ఆకట్టుకున్నాడు. తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా రికార్డు పుటల్లోకెక్కిన లబూషేన్‌.. అప్పట్నుంచి ఇప్పటివరకూ వెనుదిరిగి చూడలేదు. వరుస పెట్టి సెంచరీలు సాధిస్తూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు.

లబూషేన్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకూ మూడు టెస్టు సెంచరీలు సాధించగా ఆ మూడు వరుసగా వచ్చినవే కావడం అతని బ్యాటింగ్‌లో పరిణితికి అద్దం పడుతోంది. తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం సూపర్‌ సక్సెస్‌ చేసుకున్న క్రికెటర్‌ లబూషేన్‌. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో లబూషేన్‌(143) భారీ సెంచరీ సాధించాడు. అంతకుముందు పాకిస్తాన్‌తో జరిగిన వరుస రెండు టెస్టుల్లో భారీ శతకాలనే నమోదు చేశాడు. పాక్‌తో తొలి టెస్టులో 162 పరుగులు, రెండో టెస్టులో 185 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ విజయాల్లో పాలు పంచుకున్నాడు.

అయితే ఈ ఏడాది వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా లబూషేన్‌ మరో రికార్డు సాధించాడు.న్యూజిలాండ్‌తో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ ఈ మార్కును చేరాడు.  కివీస్‌తో రెండో ఇన్నింగ్స్‌కు ముందు లబూషేన్‌ 972 పరుగుల్ని ఈ ఏడాదే సాధించి తొలి స్థానంలో ఉండగా, మరో 28 పరుగుల్ని పూర్తి చేసుకుని సహస్ర ధీరుడుగా నిలిచాడు. దాంతో ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి టెస్టు పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్‌ క్రికెటర్ల జాబితాలో లబూషేన్‌ కూడా స్థానం సంపాదించాడు. 2014 నుంచి చూస్తే వెయి పరుగుల్ని ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వార్నర్‌ రెండు సార్లు సాధిస్తే, స్మిత్‌ నాలుగు సార్లు ఆ ఫీట్‌ సాధించాడు. వోగ్స్‌ ఒకసారి ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో వెయ్యి పరుగులు సాధించిన మరో క్రికెటర్‌. ఇప్పుడు వారి సరసన లబూషేన్‌ కూడా చేరిపోయాడు. ఈ ఏడాది అత్యధిక టెస్టు పరుగులు సాధించిన జాబితాలో లబూషేన్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ తర్వాత స్థానంలో ఆసీస్‌కే చెందిన స్టీవ్‌ స్టిత్‌(857) ఉన్నాడు.

మరిన్ని వార్తలు