అంతర్జాతీయ క్రికెట్‌కు మలింగా గుడ్‌బై?

8 Feb, 2018 17:51 IST|Sakshi
లసిత్‌ మలింగ (ఫైల్‌ఫొటో)

సాక్షి, ముంబై : శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కొలు చెప్పనున్నాడా అంటే, అవుననే అంటున్నాడు. బుధవారం ముంబై ఇండియన్స్‌కు బౌలింగ్‌ కోచ్‌గా నియామకం అనంతరం మలింగ తన రిటైర్మెంట్‌ గురించి పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. 'నేను క్రికెట్‌ ఆడటం పూర్తయ్యిందని అనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో నేను ఆడతానని అనుకోవట్లేదు. నేను నా రిటైర్మెంట్‌ను త్వరలోనే ప్రకటించేందుకు సిద్దమౌతున్నాను. అయితే ఈ విషయం గురించి శ్రీలంక క్రికెట్‌ బోర్డుతో నేను చర్చించలేదు. ఒకవేళ నేను తిరిగి క్రికెట్‌ ఆడాలనుకుంటే డొమెస్టిక్‌ క్రికెట్‌ ఆడొచ్చేమో.. దానికైనా నా శరీరం సహకరించాలి. ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా నా కొత్త ప్రయాణం ప్రారంభం కానుంది. ఇక భవిష్యత్తులో క్రికెట్‌ ఆడకపోవచ్చు' అంటూ వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం తనకు 34ఏళ్లని తెలిపిన మలింగ, తానేమీ యువకుడిని కాదని తన రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని పేర్కొన్నాడు. రాబోయే యువ పేసర్లకు తనకు తెలిసిన విషయాలను, క్రికెట్‌ నాలెడ్జ్‌ను పంచుతానని అన్నాడు. బూమ్రా డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేయగల ఆటగాడిగా ఎదిగాడని పొగడ్తలు గుప్పించాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో విడిదీయలేని అనుబంధం ఏర్పడిందని ఈ పదేళ్లలో నేను చాలా నేర్చుకున్నానని, సాధించానని తెలిపాడు.  2009 నుంచి ముంబై ఇండియన్స్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మలింగా మెత్తం 110 మ్యాచ్‌లాడి 157 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని వార్తలు