IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌కు గుడ్‌బై.. ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా?! మరి రోహిత్‌?

25 Nov, 2023 09:29 IST|Sakshi
ముంబై ఇండియన్స్‌ సారథి రోహిత్‌ శర్మతో పాండ్యా (PC: BCCI/IPL)

IPL 2024- Hardik Pandya- Rohit Sharma- Mumbai Indians: టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌, పరిమిత ఓవర్ల జట్టు వైస్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్‌ కెరీర్‌ గురించి ఆసక్తికర వార్తలు తెరమీదకు వచ్చాయి. ఈ బరోడా ప్లేయర్‌ తిరిగి ముంబై ఇండియన్స్‌ గూటికి చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పి.. అంబానీ ఫ్రాంఛైజీతో మరోసారి ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమయ్యాడనేది వాటి సారాంశం. కాగా ముంబై ఇండియన్స్‌ ద్వారా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టిన హార్దిక్‌ పాండ్యా కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది.

కాసుల వర్షం.. టీమిండియాలో ఎంట్రీ
2015లో ఎంట్రీ ఇచ్చిన పాండ్యా ముంబై జట్టులో స్టార్‌గా ఎదిగి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా.. ఆ మరుసటి ఏడాదే అంతర్జాతీయ టీ20లలో అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నాడు. అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

వదిలేసిన ముంబై.. కెప్టెన్‌ హోదా కట్టబెట్టిన గుజరాత్‌
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2021, టీ20 వరల్డ్‌కప్‌-2021 సమయంలో గాయాల కారణంగా ఇబ్బంది పడ్డ పాండ్యా విమర్శల పాలయ్యాడు. అయితే, సవాళ్లను అధిగమించి కఠిన శ్రమకోర్చి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్‌తో అతడి బంధానికి తెరపడగా.. గతేడాది కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ హార్దిక్‌ పాండ్యాను సొంతం చేసుకుంది. 

అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిపి
అంతేకాదు కెప్టెన్‌గా హోదానూ కట్టబెట్టింది. అయితే, అంతకుముందెన్నడూ సారథిగా పనిచేసిన అనుభవం లేని పాండ్యా అనూహ్య రీతిలో అరంగేట్రంలోనే గుజరాత్‌ను చాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్‌-2023లోనూ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. 

ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 వేలానికి ముందు ఫ్రాంఛైజీలు డైరెక్ట్‌ స్వాప్‌ ద్వారా ఆటగాళ్లను పరస్పరం మార్చుకునే అవకాశమిచ్చింది బీసీసీఐ. అదే విధంగా.. రిటెన్షన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసేందుకు నవంబరు 26, సాయంత్రం నాలుగు గంటల వరకు గడువు విధించింది.

పాండ్యా కోసం రూ. 15 కోట్లు
ఈ నేపథ్యంలో..  హార్దిక్‌ పాండ్యా గురించి తాజాగా ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫో కథనం ప్రకారం.. ముంబై ఇండియన్స్‌ పాండ్యాను తిరిగి తమ జట్టులోకి ఆహ్వానించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇందుకోసం గుజరాత్‌ టైటాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని రూ. 15 కోట్లు వెచ్చించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. పాండ్యాకు మళ్లీ ప్రత్యేకంగా ఎంత ఫీజు చెల్లిస్తుందన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు.

రోహిత్‌ కెప్టెన్‌గా ఉంటాడా?
అయితే, ఈ విషయంపై అటు ముంబై ఇండియన్స్‌ కానీ.. ఇటు గుజరాత్‌ టైటాన్స్‌ కానీ ఇంతవరకు స్పందించలేదు. క్రీడా వర్గాల్లో మాత్రం ఇందుకు సంబంధించి జోరుగా చర్చ నడుస్తోంది. ఒకవేళ ముంబై పాండ్యాను తీసుకుంటే అతడికి బదులు ఎవరిని పంపిస్తుంది?

రోహిత్‌ శర్మ ఉండగా.. హార్దిక్‌ తిరిగొస్తే అతడు ఆటగాడిగా కొనసాగుతాడా? లేదంటే గత సీజన్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రోహిత్‌ స్థానంలో పాండ్యా పగ్గాలు చేపడతాడా? గుజరాత్‌ నిజంగానే పాండ్యాను వదులుకునేందుకు సిద్ధపడుతుందా?

ఒకవేళ టీమిండియా స్టార్‌ శుబ్‌మన్‌ గిల్‌ను సారథిగా నియమించేందుకు గుజరాత్‌.. ముంబై ఫ్రాంఛైజీ ప్రతిపాదనకు అంగీకరించిందా? ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్లు చర్చోపర్చలు సాగిస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈ విషయంపై ఊహాగానాలు ఇలాగే కొనసాగుతూనే ఉంటాయనడంలో సందేహం లేదు. 

చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర
కాగా ముంబై టైటిల్‌ గెలిచిన నాలుగు సందర్భాల్లోనూ హార్దిక్‌ పాండ్యా ఆ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా 2019, 2020 సీజన్లలో జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

చదవండి: సచిన్‌, కోహ్లి కాదు! అత్యంత ఖరీదైన భవనంలో నివసిస్తున్న భారత క్రికెటర్‌? 

A post shared by Hardik Himanshu Pandya (@hardikpandya93)

మరిన్ని వార్తలు