మంచిర్యాల టైగర్స్‌ విజయం 

12 Mar, 2020 14:27 IST|Sakshi

తెలంగాణ కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌

హైదరాబాద్‌: తెలంగాణ కబడ్డీ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌–3లో మంచిర్యాల టైగర్స్‌ జోరు కనబరుస్తోంది. యూసుఫ్‌గూడ కేవీబీఆర్‌ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో మంచిర్యాల టైగర్స్‌ 46–43తో రంగారెడ్డి రైడర్స్‌పై విజయం సాధించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లాడిన మంచిర్యాల జట్టు 5 మ్యాచ్‌ల్లో గెలుపొంది 26 పాయింట్లతో రెండోస్థానానికి ఎగబాకింది. మ్యాచ్‌ ఆరంభంలో దూకుడు కనబరిచిన మంచిర్యాల తొలి అర్ధభాగంలో 20–17తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో మంచిర్యాల జట్టుకు దీటుగా బదులిచ్చిన రంగారెడ్డి రైడర్స్‌ 26–26తో సమానంగా పాయింట్లు సాధించింది.  దీంతో మ్యాచ్‌ మంచిర్యాల జట్టు సొంతమైంది.

రంగారెడ్డి రైడర్స్‌ ఆటగాళ్లు యుగేందర్‌ రెడ్డి (14 పాయింట్లు) ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకోగా... ఎస్‌కే అమీర్‌ (5 పాయింట్లు) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాన్ని గెలుచుకున్నారు. మరో మ్యాచ్‌లో నల్లగొండ ఈగల్స్‌ 34–30తో సైబరాబాద్‌ చార్జర్స్‌పై గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో 11 పాయింట్లు సాధించిన సైబరాబాద్‌ చార్జర్స్‌ రైడర్‌ రాజ్‌ కుమార్‌ ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’... నల్లగొండ ఈగల్స్‌ ప్లేయర్‌ సాయి కిరణ్‌ (4 పాయింట్లు) ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డులను అందుకున్నారు. కరీంనగర్‌ కింగ్స్, గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌ 33–33తో టై అయింది. మ్యాచ్‌ ఆరంభంలో వేగంగా ఆడిన కరీంనగర్‌ తొలి అర్ధభాగంలో 20–15తో ముందంజ వేసింది. అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ స్కోరును సమం చేసి ఓటమి తప్పించుకుంది. 16 పాయింట్లు సాధించిన కరీంనగర్‌ జట్టు రైడర్‌ కె. సుశాంక్‌ ‘బెస్ట్‌ రైడర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. గద్వాల్‌ గ్లాడియేటర్స్‌ డిఫెండర్‌ సాయి కృష్ణకు ‘బెస్ట్‌ డిఫెండర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. 

మరిన్ని వార్తలు