అపరిచిత మహిళకు షమీ మెసేజ్‌

10 Jul, 2019 09:08 IST|Sakshi
సోఫియా, మహ్మద్‌ షమీ

న్యూఢిల్లీ : ఆఫ్‌ఫీల్డ్‌ కారణాలతో టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ మళ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఇప్పటికే అతని భార్య హసీన్‌ జహాన్‌ షమీ స్త్రీలోలుడని, చాలా మందితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్నాడని, అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో షమీపై పోలీసులు చార్జ్‌షీట్‌ కూడా నమోదు చేశారు. అతని క్రికెట్‌ కెరీర్‌ నాశనం చేసేలా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కూడా జహాన్‌ ఆరోపించింది. ముందుగా షమీకి కాంట్రాక్ట్‌ నిరాకరించిన బీసీసీఐ.. విచారణ జరిపి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఆ తర్వాత తన ఆటలో మరింత రాటుదేలిన షమీ టీమిండియా వరుస విజయాల్లో భాగమయ్యాడు. (చదవండి: షమీపై చార్జ్‌షీట్‌ నమోదు)

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్‌లో రాణిస్తున్న షమీపై తాజాగా ఆ రకమైన ఆరోపణలే వ్యక్తమయ్యాయి. ఏ మాత్రం పరిచయం లేని షమీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తనకు పదేపదే మెసేజ్‌లు పంపిస్తున్నాడని సోఫియా అనే మహిళ ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘1.4 మిలియన్‌ ఫాలోయర్స్‌ ఉన్న గొప్ప క్రికెటర్‌ నాకే ఎందుకు మెసేజ్‌ చేస్తున్నాడో ఎవరైన చెప్పగలరా?’ అని మెసేజ్‌ స్క్రీన్‌ షాట్స్‌ జత చేసి ప్రశ్నించింది. అయితే షమీ సదరు మహిళకు ‘గుడ్‌ ఆఫ్టర్‌నూన్‌’ అని మెసేజ్‌ చేసినట్లు ఆ స్క్రీన్‌ షాట్స్‌లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్‌ క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అభిమానులు మాత్రం సోఫియా పోస్ట్‌పై భిన్నభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొందరు షమీ చేసిన మెసేజ్‌లో తప్పేం ఉందని ప్రశ్నిస్తూ మద్దుతుగా నిలుస్తుండగా.. మరికొందరు అతను నిజంగా స్త్రీలోలుడేనని తప్పుబడుతున్నారు. ఒంటరిగా ఉండలేక మెసేజ్‌ చేసినట్లున్నాడని మరికొందరు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి : ‘ముస్లిం కాబట్టే షమీని పక్కన పెట్టారు’)

ఇక ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడిన షమీ 14 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. అఫ్గానిస్తాన్‌ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ సాధించి ఔరా అనిపించాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్‌ ఓడినప్పటికి షమీ 5 వికెట్ల ఫీట్‌ను అందుకున్నాడు. పాకిస్తాన్‌ మ్యాచ్‌లో భువనేశ్వర్‌ గాయపడటంతో తుది జట్టులోకి వచ్చిన షమీ.. తన అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. గాయం నుంచి భువీ కోలుకోవడంతో శ్రీలంకతో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్‌కు బెంచ్‌కే పరిమితమయ్యాడు. అయితే కీలక సెమీఫైనల్‌ మ్యాచ్‌కు షమీని పక్కన బెట్టడంపై మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ విశ్లేషకులు, అభిమానులు విస్మయం వ్యక్తం చేశారు. (చదవండి: ఇదేంటి.. జట్టులో షమీ లేడు? )

మరిన్ని వార్తలు