టీ20ల్లో ధోని అరుదైన రికార్డు

19 May, 2018 14:57 IST|Sakshi
ఎంఎస్‌ ధోని

న్యూఢిల్లీ : చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో 6వేల పరుగులు క్లబ్‌లో చేరిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా, తొలి భారత వికెట్‌ కీపర్‌గా ధోని గుర్తింపు పొందాడు. ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన‌ మ్యాచ్‌లో ధోని ఈ మైలురాయి అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు ధోని 6వేల పరుగులకు 10 పరుగుల దూరంలో ఉండగా.. ఈ మ్యాచ్‌లో ధోని 17 పరుగులు చేసిన విషయం తెలిసిందే. బౌల్ట్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి ధోని వెనుదిరిగాడు. దీంతో అతడు టీ20 క్రికెట్‌లో 6 వేల పరుగులు సాధించినట్లైంది. ఈ ఘనత సాధించిన ఐదో భారతీయుడు ధోని నిలిచాడు. సురేశ్‌ రైనా(7,708), విరాట్‌ కోహ్లీ (7,621), రోహిత్‌ శర్మ(7,303), గౌతమ్‌ గంభీర్‌(6,402)... ధోని కంటే ముందున్నారు. ఇక ఓవరాల్‌గా 11,436 పరుగులతో వెస్టిండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ అగ్రస్థానంలోఉండగా.. కివీస్‌ బ్యాట్స్‌మన్‌ మెక్‌కల్లమ్‌ 9,119 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.

మరో ఐపీఎల్‌ రికార్డు చేరువలో..
ధోని కెరీర్‌లో ఇది 290వ టీ20 మ్యాచ్ కాగా... ఐపీఎల్‌లో 4వేల పరుగుల క్లబ్‌కు చేరువయ్యాడు. ఇప్పటి వరకు ధోని ఐపీఎల్‌లో సాధించిన పరుగులు 3,974. మరో 26 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్‌లో 4వేల పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కూడా చేరుతాడు.

మరిన్ని వార్తలు