మా సమర్థతకు అనేక ఉదాహరణలు

1 Aug, 2019 03:28 IST|Sakshi

బుమ్రా, హార్దిక్‌ను వెలుగులోకి తెచ్చింది మేమే కదా?

రిషభ్‌ పంత్‌ను తీర్చిదిద్దింది ఇదే సెలక్షన్‌ కమిటీ

భారత ‘ఎ’ జట్టు ఫలితాల్లోనూ మా చొరవ

చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌

న్యూఢిల్లీ: తన ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీ సమర్థతపై వస్తున్న విమర్శలకు భారత చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ గట్టిగా బదులిచ్చారు. తమ బృందానికే గనుక దూరదృష్టి లేకుంటే జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్‌ వంటి ఆటగాళ్లు వెలుగులోకి వచ్చేవారా? అని ప్రశ్నించారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ రెండో భాగంలో ఆయన... ఒక సెలక్షన్‌ కమిటీకి ఉండాల్సిన అర్హతలేంటో వివరించారు. ఇంకా ఏం చెప్పారంటే... 

పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా భావించిన బుమ్రా ఇప్పుడు ప్రపంచ నంబర్‌ వన్‌ టెస్టు బౌలర్‌. టి20లకే పనికొస్తాడని అనుకున్న హార్దిక్‌ నేడు అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న ఆల్‌రౌండర్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అశ్విన్, జడేజా వంటి పేరున్న స్పిన్నర్ల స్థానంలో చహల్, కుల్దీప్‌లను ప్రత్యామ్నాయంగా తెచ్చాం. దూకుడైన రిషభ్‌ పంత్‌ను ఎవరూ ఊహించని విధంగా తక్కువ వ్యవధిలోనే తీర్చిదిద్ది టెస్టుల్లో ప్రవేశపెట్టాం. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో అతడెలా రాణించాడో అందరం చూశాం. మయాంక్‌ అగర్వాల్, హనుమ విహారి పురోగతి, ఖలీల్‌ అహ్మద్, నవదీప్‌ సైనీ వంటి వారితో పేస్‌ బౌలింగ్‌ బలం ఎలా పెరిగిందో చూస్తున్నాం. మా దూరదృష్టికి ఇవన్నీ ఉదాహరణలే.  సీనియర్‌ జట్టు వెన్నంటే ‘ఎ’ జట్టు విదేశీ పర్యటనలు సాగేలా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి, ‘ఎ’ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో సమన్వయం చేసుకుని ఫలితాలు సాధించాం. మాకే గనుక బ్లూ ప్రింట్‌ లేకుంటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? 

సెలక్టర్‌ కనీస సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి ఉండాలన్నది ఒక అంశమే. దాంతోపాటు నిజాయతీ, నిబద్ధత, గోప్యత, సమగ్రత... ఈ నాలుగు అంశాలు ఒక మంచి సెలక్షన్‌ కమిటీకి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు. మా కమిటీకి ఇవన్నీ ఉన్నాయని నేను 100 శాతం కచ్చితంగా చెప్పగలను. ధోని ఇప్పటికీ భారత్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఉత్తమ ఫినిషర్, కీపర్‌ (ప్రపంచ కప్‌లో ధోని కోసం మిడిలార్డర్‌ కూర్పుపై రాజీపడ్డారా? అన్న ప్రశ్నకు). మిగతావారు క్రమంగా మెరుగవుతున్నారు. జట్టు, కెప్టెన్‌ మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో తన విశేష అనుభవాన్ని పంచుకుంటూ కీపర్, బ్యాట్స్‌మన్‌గా ధోని ప్రపంచ కప్‌లో జట్టుకు కొండంత అండగా ఉన్నా డు. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలిచి ఉంటే ధోని–జడేజా భాగస్వామ్యం మరుపురానిదిగా మిగిలిపోయేది. 

అవకాశం దొరికితే సొంతగడ్డపై జరిగే దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ సిరీస్‌లకు ధోనిని ఎంపిక చేస్తారా అంటే... గతంలో చెప్పినట్లే మాకు ప్రపంచ కప్‌ తర్వాత వేరే ప్రణాళికలున్నాయి. చాలినన్ని అవకాశాలతో పంత్‌లో ఆత్మవిశ్వాసం కల్పించి జట్టు అవసరాలకు తగ్గట్లు అతడు రాణించాలన్నది మా ఆలోచన. జట్టు పునర్నిర్మాణం నిరంతర ప్రక్రియ. ఈ ఏడాది మొదట్లో ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ గెలిచాం. భవిష్యత్‌పై ఆశావహంగా, టెస్టు చాంపియన్‌షిప్‌పై ఉత్సుకతతో ఉన్నాం. ‘ఎ’ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శన చేస్తున్న కొందరు కుర్రాళ్లకు పరిమిత ఓవర్ల ఆటలో చోటు కల్పించాం. వారు దానిని నిలబెట్టుకుంటే మరిన్నిఅవకాశాలుంటాయి.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు