‘అందుకే కుల్దీప్‌, చహల్‌లను తీసుకోలేదు’

10 Sep, 2019 13:53 IST|Sakshi

ముంబై:  వరల్డ్‌టీ20కి ఏడాది మాత్రమే సమయం ఉన్నందున టీమిండియా ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా రాబోవు సిరీస్‌ల్లో యువ క్రికెటర్లను పరీక్షించాలనే ఉద్దేశంతో కీలక ఆటగాళ్లకు కూడా విశ్రాంతి కల్పిస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనితో పాటు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తమదైన ముద్ర వేసిన కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చహల్‌లకు కూడా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయలేదు. ఇప‍్పటికే ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చామో స్పష్టం చేసిన చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌..  తాజాగా కుల్దీప్‌, చహల్‌ను ఎందుకు తప్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చాడు.

‘స్పిన్‌ బౌలింగ్‌ విభాగంలో కాస్త వైవిధ్యమైన బౌలర్లను ఎంపిక చేయాలనుకున్నాం. ఆస్ట్రేలియాలో జరుగున్న  టీ20 వరల్డ్‌కప్‌ నాటికి యువ క్రికెటర్లను పూర్తి స్థాయిలో పరీక్షించాలనుకుంటున్నాం. కుల్దీప్‌, చహల్‌లు పొట్టి ఫార్మాట్‌లో అసాధారణమైన బౌలర్లు. అందులో ఎటువంటి సందేహం లేదు. గత రెండేళ్లుగా జట్టులో వారి ముద్ర కనబడుతోంది. జట్టును ఎప్పుడు ఎంపిక చేసినా వారు ముందు వరుసలో ఉంటారు. కాకపోతే మాకున్న మిగతా బౌలింగ్‌ ఆప్షన్స్‌కు పరీక్షించాలనుకుంటున్నాం. ఇటీవల కాలంలో యువ క్రికెటర్లు కూడా సత్తా చాటుతున్నారు. ఫాస్ట్‌ బౌలర్‌ నవదీప్‌ షైనీతో పాటు బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు వారి సత్తాను నిరూపించుకున్నారు. ఇక కృనాల్‌  పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌లు కూడా పొట్టి ఫార్మాట్‌లో వారి ప్రతిభను చాటుకున్నారు. వారికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కుల్దీప్‌, చహల్‌లను పక్కకు పెట్టాం’ అని ఎంఎస్‌కే పేర్కొన్నాడు.  ఆదివారం నుంచి భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్‌ ఆరంభం కానుంది.

>
మరిన్ని వార్తలు