BBL 2023: ప్ర‌మాద‌క‌రంగా మారిన పిచ్‌.. 6 ఓవ‌ర్ల త‌రువాత మ్యాచ్ ర‌ద్దు! వీడియో వైరల్‌

10 Dec, 2023 18:20 IST|Sakshi

ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్-2023లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో ఆదివారం మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పిచ్ సమస్య కారణంగా రద్దు చేశారు. 

ఏమి జరిగిందంటే?
ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే మరో ఓపెనర్‌ కూపర్ కొన్నోలీ(6) కూడా పెవిలియన్‌కు చేరాడు.

అయితే ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి బంతి  అనూహ్యంగా బౌన్స్‌ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో పెర్త్‌ స్కాచర్స్‌ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన విల్‌ సదర్లాండ్‌ బౌలింగ్‌లో మొదటి మూడు బంతులు మరీ ఎక్కువగా బౌన్స్‌ అయ్యాయి.  బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు పరిస్థితిని అంపైర్‌లు  దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో అంపైర్లు.. ఇరు జట్ల సారథులతో చర్చించి మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి గిలాంగ్ లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కవర్స్ లీక్ అయ్యి నీరు పిచ్ పై చేరి ఉంటుందని, అందుకే బంతి ఎక్కువగా బౌన్స్‌ అయిందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

>
మరిన్ని వార్తలు