నాకౌట్‌ దశకు ఆంధ్ర

13 Feb, 2018 03:55 IST|Sakshi
శ్రీకర్‌ భరత్‌, అశ్విన్‌ హెబర్‌

వరుసగా ఐదో విజయం నమోదు

భరత్‌ సెంచరీ, అశ్విన్‌ 99

గుజరాత్‌పై తొమ్మిది వికెట్లతో గెలుపు

చెన్నై: విజయ్‌ హజారే టోర్నీలో ఆంధ్ర క్రికెట్‌ జట్టు  జైత్రయాత్ర కొనసాగిస్తూ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. గుజరాత్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేసిన ఆంధ్ర 20 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముంబై 16 పాయింట్లతో ఇదే గ్రూప్‌ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 251 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్‌ నష్టపోయి 45.2 ఓవర్లలో ఛేదించింది.

ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్‌ (132 బంతుల్లో 106 నాటౌట్‌; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్‌ అశ్విన్‌ హెబర్‌ (108 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కేవలం పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించడం విశేషం. అశ్విన్‌ ఔటయ్యాక కెప్టెన్‌ విహారి (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి భరత్‌ ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు గుజరాత్‌ సరిగ్గా 50 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్‌ పటేల్‌ (39; 7 ఫోర్లు), రిజుల్‌ భట్‌ (74; 2 ఫోర్లు), పియూష్‌ చావ్లా (56; 6 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో  కార్తీక్‌ రామన్‌ (4/32), బండారు అయ్యప్ప (2/68), నరేన్‌ రెడ్డి (2/35) ఆకట్టుకున్నారు.   

మరిన్ని వార్తలు