ముస్తాఫిజుర్‌కు నో క్లియరెన్స్‌

9 Dec, 2018 16:57 IST|Sakshi

ఢాకా: గత కొన్ని సీజన్‌ల నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో ఆడుతూ వస్తున్న బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌.. వచ్చే ఏడాది జరుగనున్న ఈ టోర్నీలో పాల్గొనే అవకాశాలు దాదాపు సన్నగిల్లిపోయాయి. ఐపీఎల్‌లో ఆడటానికి క్లియరెన్స్‌ ఇవ్వాలంటూ ముస్తాఫిజుర్‌ చేసుకున్న విజ్ఞప్తి ఆ దేశ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) తాజాగా తిరస్కరించింది. ముస్తాఫిజుర్‌ తరుచు విదేశాల్లో జరిగే టీ20 లీగ్‌ల్లో పాల్గొంటూ గాయాల బారిన పడుతున్నాడు. దాంతో ముస్తాఫిజుర్‌ను టీ20 లీగ్‌లకు అనుమతి నిరాకరిస్తూ గత జూన్‌ మాసంలో బీసీబీ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా ముస్తాఫిజుర్‌ను విదేశాల్లో జరిగే టీ20ల్లో పాల్గొనకుండా బీసీబీ నియంత్రిస్తుంది. ప్రధానంగా జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లకే అధిక ప్రాధాన్యత ఇ‍వ్వాలని ఇప్పటికే పలుమార్లు చెప్పిన బోర్డు.. మరొకసారి అదే విషయాన్ని ముస్తాఫిజుర్‌కు తెలియజేస్తూ ఎన్‌ఓసీ(నో అబ్జెక్షన్‌ సర్టిఫికేట్‌) ఇవ్వడానికి నిరాకరించింది.

2016 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టైటిల్‌ సాధించడంలో ముస్తాఫిజుర్‌ కీలక పాత్ర పోషించాడు . 16 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు సాధించి ప‍్రధాన పాత్ర పోషించాడు. అయితే 2017కు వచ్చేసరికి హైదరాబాద్‌ తరఫున కేవలం మ్యాచ్‌ మాత్రమే ఆడాడు. కాగా, 2018లో ముంబై ఇండియన్స్‌ ముస్తాఫిజుర్‌ను జట్టులోకి తీసుకుంది. ఏడు మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజర్‌ గాయం బారిన పడి టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్‌ ముస్తాఫిజుర్‌ను వదలుకుంది. ముంబై ఇండియన్స్‌ 10 మంది ఆటగాళ్లను విడుదల చేయగా అందులో ముస్తాఫిజుర్‌ను కూడా చేర్చింది. త్వరలో ఐపీఎల్‌ వేలం జరుగనున్న నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ తమ దేశ క్రికెట్‌ బోర్డును ఆశ్రయించగా అతని చుక్కెదురైంది. 

మరిన్ని వార్తలు