నాదల్‌ను ఆపతరమా!

26 May, 2019 04:44 IST|Sakshi

12వ ‘ఫ్రెంచ్‌’ టైటిల్‌పై స్పెయిన్‌ స్టార్‌ గురి

జొకోవిచ్‌ నుంచి గట్టి పోటీ

నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: ఈ ఏడాది గొప్పగా ఫామ్‌లో లేకపోయినప్పటికీ ఫ్రెంచ్‌ ఓపెన్‌ అనేసరికి రాఫెల్‌ నాదల్‌కు ఎక్కడలేని శక్తి వస్తుంది. తనకెంతో కలిసొచ్చిన మట్టి కోర్టులపై నాదల్‌ను నిలువరించాలంటే అతని ప్రత్యర్థులు విశేషంగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే రికార్డుస్థాయిలో 11సార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ను నెగ్గిన నాదల్‌ 12వసారి ఈ ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలతో ఉన్నాడు. ఆదివారం మొదలయ్యే సీజన్‌ రెండో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగుతున్న నాదల్‌కు వరల్డ్‌ నంబర్‌వన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా) నుంచే గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది.

ఇటీవలే రోమ్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ సాధించి ఫామ్‌లోకి వచ్చిన నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌లో అద్వితీయమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫ్రెంచ్‌ ఓపెన్‌ చరిత్రలో మొత్తం 86 మ్యాచ్‌ల్లో గెలిచిన నాదల్‌ కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే (2015లో క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌ చేతిలో, 2009లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సోడెర్లింగ్‌ చేతిలో) ఓడిపోయాడు. 2016లో మార్సెల్‌ గ్రానోలెర్స్‌ (స్పెయిన్‌)తో జరగాల్సిన మూడో రౌండ్‌ మ్యాచ్‌లో గాయం కారణంగా బరిలోకి దిగకుండానే ‘వాకోవర్‌’ ఇచ్చాడు.  మరోవైపు టాప్‌ సీడ్‌ జొకోవిచ్‌ ఈసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిస్తే రెండుసార్లు వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను నిలబెట్టుకున్న రెండో ప్లేయర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

‘డ్రా’ ప్రకారం జొకోవిచ్‌కు నాదల్‌ ఫైనల్లోనే ఎదురయ్యే అవకాశముంది. ఇక మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్‌ ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో లొరెంజో సొనెగో (ఇటలీ)తో తలపడతాడు. నాదల్, జొకోవిచ్‌ కాకుండా నాలుగో ర్యాంకర్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), ఐదో ర్యాంకర్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఆరో ర్యాంకర్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) కూడా టైటిల్‌ రేసులో ఉన్నారు. భారత్‌ తరఫున ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మాత్రమే మెయిన్‌ ‘డ్రా’లో ఉన్నాడు. ఆదివారం జరిగే తొలి రౌండ్‌లో హుగో డెలియన్‌ (బొలీవియా)తో ప్రజ్నేశ్‌ ఆడతాడు.  

పలువురు ఫేవరెట్స్‌...
మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈసారీ పలువురు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నారు. డిఫెండింగ్‌ చాంపియన్‌ సిమోనా హలెప్‌ (రొమేనియా)తోపాటు వరల్డ్‌ నంబర్‌వన్‌ నయోమి ఒసాకా (జపాన్‌), మాజీ విజేత గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌) టైటిల్‌ గెలిచే అవకాశాలున్నాయి. మాజీ నంబర్‌వన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) ఫిట్‌నెస్‌ సమస్యను అధిగమిస్తే ఆమె ఖాతాలో మరో టైటిల్‌ చేరవచ్చు. గతేడాది యూఎస్‌ ఓపెన్, ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ సాధించిన ఒసాకా వరుసగా మూడో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై గురి పెట్టింది.  అయితే ఆమెకు రెండో రౌండ్‌లో మాజీ విజేత ఒస్టాపెంకో రూపంలో సవాల్‌ ఎదురయ్యే చాన్స్‌ ఉంది.

మరిన్ని వార్తలు