క్యాచ్‌ వదిలేశాడు.. రివ్యూ కోరాడు!

5 Apr, 2019 16:12 IST|Sakshi

పాక్‌ క్రికెటర్‌ షెహజాద్‌ నిర్వాకం

నువ్వు మహా నటుడిలా ఉన్నావ్‌ అంటూ విమర్శలు

లాహోర్‌: క్యాచ్ వదిలేసి రివ్యూ కోరిన పాక్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ‘పాకిస్తాన్ కప్’లో భాగంగా ఈ నెల 2న లిస్ట్ ఎ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఇందులో ఐదు జట్లు పాల్గొంటున్నాయి.  ఫెడరల్ ఏరియాస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న షెజాద్.. ఖైబర్ పఖ్తుంఖ్వాతో జరిగిన మ్యాచ్‌లో చేతిలో పడిన క్యాచ్‌ను వదిలేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు రివ్యూ కోరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. ఖైబర్ పఖ్తుంఖ్వా ఆటగాడు ఖుష్‌దిల్ షా భారీ షాట్‌కు యత్నించాడు. డీప్ మిడ్ వికెట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న షెహజాద్‌ బంతిని అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. కిందపడిన బంతిని తిరిగి చేతిలోకి తీసుకుని క్యాచ్ అందుకున్నట్టు నటించాడు. అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించడంతో రివ్యూ కోరి అభాసుపాలయ్యాడు. కిందపడిన బంతిని తీరిగ్గా చేతుల్లోకి తీసుకున్నట్టు రివ్యూలో స్పష్టంగా కనబడుతోంది.

ఇప్పుడీ వీడియో వైరల్ అవుతుండడంతో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాళ్లు చీటింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారని నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘గతంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో కూడా నువ్వు ఇలానే చేశావ్‌.. ఉమర్‌ అక్మల్‌ను తలపిస్తున్నావ్‌. మీకు అసలు బుర్ర ఉందా అంటూ ఒకరు ఎద్దేవా చేయగా, ‘సరైన క్రికెట్‌ ఆడని నువ్వు.. గిల్లీ దండా ఆడుకో’ అని మరొక అభిమాని విమర్శించాడు. ‘నువ్వు కెమెరా ఆన్‌లో ఉండగానే ఇలా చీట్‌ చేస్తే, కెమెరా ఆన్‌లో లేని దేశవాళీ క్రికెట్‌లో ఇలాంటివి ఎన్ని మోసాలు చేశావో’ అంటూ మరొకరు విరుచుకుపడ్డారు. ‘నువ్వు మహా నటుడిలా ఉన్నావే’ అని మరొక అభిమాని చమత్కరించాడు.
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు