పాక్‌ జట్టులో మూడు మార్పులు  

21 May, 2019 00:32 IST|Sakshi

ఆమిర్, రియాజ్,  ఆసిఫ్‌ అలీలకు స్థానం

జునైద్, ఆబిద్, అష్రఫ్‌లపై వేటు

ప్రపంచకప్‌కు తుది జట్టు ప్రకటన  

కరాచీ: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న పాకిస్తాన్‌ బౌలింగ్‌ దళంలో ప్రపంచకప్‌ కోసం మార్పులు జరిగాయి. అనుభవజ్ఞులైన లెఫ్టార్మ్‌ పేసర్లు మొహమ్మద్‌ ఆమిర్, వహాబ్‌ రియాజ్‌లను మెగా ఈవెంట్‌కు ఎంపిక చేసింది. నిజానికి వీళ్లిద్దరితో పాటు బ్యాట్స్‌మన్‌ ఆసిఫ్‌ అలీ పాక్‌ ప్రతిపాదిత ప్రపంచకప్‌ జట్టులో లేడు. కానీ పరుగుల కట్టడి కోసం సెలక్టర్లు          అనుభవజ్ఞులపై నమ్మకం వుంచారు. ముందనుకున్న ప్రపంచకప్‌ జట్టులో ఉన్న ఆల్‌రౌండర్‌ ఫహీమ్‌ అష్రఫ్, లెఫ్టార్మ్‌ పేసర్‌ జునైద్‌ ఖాన్, ఓపెనర్‌      ఆబిద్‌ అలీలను తప్పించి ఆమిర్, రియాజ్, ఆసిఫ్‌ అలీలకు స్థానం కల్పించారు.
 
జట్టు: సర్ఫరాజ్‌ అహ్మద్‌ (కెప్టెన్‌), ఫఖర్‌ జమాన్, ఇమాముల్‌ హక్, బాబర్‌ ఆజమ్, హారిస్‌ సొహైల్, ఆసిఫ్‌ అలీ, షోయబ్‌ మాలిక్, హఫీజ్, ఇమాద్‌ వసీమ్, షాదాబ్‌ ఖాన్, వహాబ్‌ రియాజ్, ఆమిర్, హసన్‌ అలీ, షాహిన్‌ ఆఫ్రిది, హస్నయిన్‌. 

ఆసిఫ్‌ అలీ ఇంట విషాదం 
పాకిస్తాన్‌ ప్రాథమిక ప్రపంచకప్‌ జట్టులో లేకపోయినా... తాజాగా ఖరారు చేసిన జట్టులో చోటు దక్కించుకున్న బ్యాట్స్‌మన్‌ ఆసిఫ్‌ అలీకి ఆనందం కంటే విషాదమే మిగిలింది. తన గారాల తనయ, రెండేళ్ల నూర్‌ ఫాతిమా క్యాన్సర్‌ వ్యాధితో సోమవారం మృతి చెందింది. ఆమెకు వ్యాధి తీవ్రమవడంతో అమెరికా తీసుకెళ్లి చికిత్స అందించారు. వ్యాధి నాలుగో దశను మించడంతో చికిత్స పొందుతూ అమెరికాలోని ఆస్పత్రిలో ఫాతిమా కన్నుమూసింది. దీంతో ఇంగ్లండ్‌లో ఉన్న అలీ హుటాహుటిన స్వదేశం పయనమయ్యాడు. 

జునైద్‌ నిరసన... 
ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించడంతో పాక్‌ బౌలర్‌ జునైద్‌ ఖాన్‌ సెలక్టర్లపై తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశాడు. ‘నేనెలాంటి వ్యాఖ్య చేయదల్చుకోలేదు. ఎందుకంటే నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది’ అని తన నోటికి నల్ల ప్లాస్టర్‌ తగిలించుకున్న ఫొటోను జునైద్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. 29 ఏళ్ల జునైద్‌ ఇంగ్లండ్‌లో ఇప్పటివరకు 9 వన్డేలు ఆడి 11 వికెట్లు తీశాడు. మరోవైపు ఆమిర్‌ ఇంగ్లండ్‌లో 9 వన్డేలు 9 వికెట్లు పడగొట్టాడు.    

>
మరిన్ని వార్తలు