‘పాక్‌లో డేవిస్‌ కప్‌ ఆడాల్సిందే’

24 Dec, 2023 04:55 IST|Sakshi

‘ఐటా’కు స్పష్టం చేసిన ఐటీఎఫ్‌

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ పోరును మార్చే విషయంలో అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా)కు ఎదురు దెబ్బ తగిలింది. పాక్‌ గడ్డపై డేవిస్‌ కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 ప్లేఆఫ్‌ ‘టై’ పోటీలు ఆడాల్సిందేనని అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) శనివారం స్పష్టం చేసింది. పాక్‌లో కాకుండా మరో తటస్థ వేదికపై ఆడేందుకు అనుమతించాలని ‘ఐటా’ గతంలో అప్పీలు చేసుకుంది. దీన్ని విచారించిన ఐటీఎఫ్‌ ట్రిబ్యునల్‌ గురువారం తమ నిర్ణయాన్ని వెలువరించింది. 15 మంది సభ్యులు గల డేవిస్‌ కప్‌ కమిటీ (డీసీసీ) ‘ఐటా’ అప్పీల్‌ను తోసిపుచ్చింది.

‘పాకిస్తాన్‌లో డేవిస్‌ కప్‌ టై పోటీలు నిర్వహించాలనే డీసీసీ నిర్ణయానికి బలమైన ఆధారాలున్నాయి. డీసీసీ ఎంపిక చేసిన వేదికపై ఆడటం అన్ని దేశాలకు వర్తిస్తుంది’ అని ట్రిబ్యునల్‌ వెల్లడించినట్లు పాకిస్తాన్‌ తెలిపింది. పాక్‌లో డేవిస్‌ కప్‌ పోటీ లు విజయవంతంగా జరి గాయని, అలాంటపుడు భారత్‌ అక్కడ ఆడటానికి విముఖత చూపడం అర్థరహితమని డీసీసీ అభిప్రాయపడింది. ‘భద్రత ఏర్పాట్లు ఆతిథ్య దేశం చూసుకుంటుంది.

కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నప్పుడు తప్పించుకోవాలనుకోవడం సబబు కాదు’ అని డీసీసీ వర్గాలు తెలిపాయి. దీనిపై ‘ఐటా’ ప్రధాన కార్యదర్శి అనిల్‌ ధూపర్‌ స్పందిస్తూ ‘క్రీడాశాఖతో ఈ విషయంపై చర్చిస్తాం. ఆ తర్వాతే జట్టును పంపడంపై మార్గదర్శకాలు వస్తాయి’ అని అన్నారు. భారత్‌ వెళ్లకపోతే పాక్‌నే విజేతగా ప్రకటిస్తారు.

>
మరిన్ని వార్తలు