పంత్‌ను పక్కన పెట్టేశారు..

1 Oct, 2019 12:56 IST|Sakshi

న్యూఢిల్లీ: అనుకున్నదే అయ్యింది. గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న టీమిండియా యువ వికెట్‌  కీపర్‌ రిషభ్‌ పంత్‌కు ఉద్వాసన పలికారు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న తొలి టెస్టుకు పంత్‌ను తప్పిస్తారని గత వారామే సూచన ప్రాయంగా తెలిసినప్పటికీ ఇప్పుడ అధికారంగా అతన్ని పక్కన పెట్టేశారు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టుకు పంత్‌ను తప్పించిన విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేసినట్లు ఐసీసీ ఒక  ట్వీట్‌  ద్వారా పేర్కొంది. పంత్‌ స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను ఎంపిక చేసినట్లు తెలిపింది. బుధవారం విశాఖలో భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ఆరంభం కానుంది.

ఎంఎస్‌ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్‌ పంత్‌  అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సంజూ శాంసన్‌ నుంచి పోటీ ఉండగా, టెస్టు ఫార్మాట్‌లో సాహా నుంచి పంత్‌కు సవాల్‌ ఎదురవుతోంది. పంత్‌ ఒక వరల్డ్‌క్లాస్‌ ఆటగాడని రవిశాస్త్రి చెబుతున్నప్పటికీ అతని ఆటపై ఎక్కడో కాస్త అనుమానం ఉండటంతో రిస్క్‌ చేయదల‍్చుకోవడానికి సిద్ధంగా లేడు.  ఇందుకు కోహ్లి నుంచి రవిశాస్త్రి మద్దతు ఉండటంతో  పంత్‌ను తప్పించారు.

బ్యాటింగ్‌, కీపింగ్‌ల్లో పంత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఒకటైతే, కీపర్‌ స్థానంలో ఉన్న ఆటగాడు డీఆర్‌ఎస్‌ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్‌ విఫలమవుతూ వస్తున్నాడు. ప్రత్యేకంగా భారత్‌ వంటి బంతి టర్న్‌ అయ్యే పిచ్‌ల్లో డీఆర్‌ఎస్‌ను నిర్దారించడంలో పంత్‌ ఇబ్బంది పడుతున్నాడు. మరొకవైపు వికెట్ల వెనుక పంత్‌ కంటే సాహానే అత్యుత్తమం అని కోహ్లి, శాస్త్రిలు భావిస్తున్నారు.  దాంతో పంత్‌ స్థానంలో సాహాను సఫారీలతో తొలి టెస్టు ఆడించడానికి రంగం సిద్ధం చేశారు. టెస్టు జట్టులో పంత్‌ ఉన్నప్పటికీ అతని స్థానంలో సాహా పేరును ఖారరు చేశారు. దాంతో సాహా తుది జట్టులో ఆడటం ఖాయం. మరి తొలి టెస్టులో సాహా రాణిస్తే పంత్‌ అవసరం ఈ సిరీస్‌లో ఉండకపోవచ్చు.

మరిన్ని వార్తలు