ప్రభుత్వ అధీనంలో మద్యం షాపులు ప్రారంభం

1 Oct, 2019 12:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మంగళవారం నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వచ్చింది. మద్యపాన నిషేధ సంస్కరణలు అమల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను ప్రభుత్వం 20శాతం తగ్గించింది. లిక్కర్ అమ్మకాల వేళల్లోనూ మార్పులు చేసింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటలవరకూ మాత్రమే మద్యం అమ్మకాలు జరపాలని నిబంధన విధించింది. అలాగే ఎమ్మార్పీ ఉల్లంఘన, బెల్ట్‌షాపుల ఏర్పాటుపై ఉక్కపాదం మోపింది. గ్రామాల్లో మద్యం మహమ్మారిని నిర్మూలించేందుకు గ్రామ, వార్డు  సచివాలయాల్లో 14 వేల 944 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించింది. కొత్త లిక్కర్ పాలసీలో భాగంగా నేటినుంచి ప్రభుత్వ అధీనంలోనే  మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం షాపులను ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ సీఐ పెద్దిరాజు ప్రారంభించారు. నియోజకవర్గంలో గతంలో 21 మద్యం షాపులు ఉండగా వాటిని 20% కుదించి.. 17 షాపులను ప్రారంభించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటైన మద్యం షాపుల్లో 17మంది సూపర్‌ వైజర్లు,17 మంది నైట్ వాచ్‌మెన్లు,  41మంది సేల్స్‌మేన్లగా నియమితులయ్యారు. ఈ మేరకు ఉద్యోగాలు లభించడంతో నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తోంది.

విచ్చలవిడి మద్యం అమ్మకాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులను నిర్వహిస్తున్నామని, మద్యం షాపుల సంఖ్యను, అమ్మకాల సమయాన్ని కుదించించడం ద్వారా ఏపీలో దశలవారీగా మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహోన్నతమైన ఆశయం కచ్చితంగా నెరవేర్చి తీరుతామని ఎక్సైజ్‌ శాఖ ధీమా వ్యక్తం చేస్తోంది.

పుత్తూరు పట్టణంలో..
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త మద్యం విధానాన్ని అమలు చేశారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 29 షాపులును కుదించి 23 షాపులు ప్రవేశపెట్టారు. 23 షాపులలో 77 మందిని సేల్స్ అండ్ క్యాషియర్‌గా నియమించారు. ఈ కొత్త మద్యం విధానంతో మద్యపానాన్ని అంచలంచలుగా నియంత్రిస్తామన్నారు పుత్తూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్‌. సీఎం వైఎస్ జగన్ హామీ ఆదేశాల మేరకు మేం కట్టుబడి పని చేస్తామని మా పరిధిలో ఎక్కడ బెల్టుషాపులు ఉన్నా తొలగిస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మోహన్ తెలిపారు.


చదవండి: రాత్రి 8 వరకే మద్యం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా