యూనిస్‌ జోక్‌ చేస్తే.. సీరియస్‌ వ్యాఖ్యలా?

3 Jul, 2020 13:25 IST|Sakshi

మాంచెస్టర్‌: తన పీకపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ యూనిస్‌ ఖాన్‌ కత్తి పెట్టి బెదిరించాడంటూ మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ)లో కలకలం రేపాయి. తాను బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో యూనిస్‌ ఖాన్‌ కత్తితో బెదిరింపులకు దిగాడంటూ ఫ్లవర్‌ చేసిన కామెంట్స్‌ను పీసీబీతో పాటు పాక్‌ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ఖండించింది. ‘ గ్రాంట్‌ ఫ్లవర్‌ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం వాస్తవం కాదు. యూనిస్‌ ఖాన్‌ ఏదో సరదాగా  కూరగాయాలు తరిగే కత్తి తీసుకుని గ్రాంట్‌ ఫ్లవర్‌ను ఆట పట్టించాడు. (రాంచీలో ధోని ఏదో చేశాడు.. లేకపోతే ఎలా?)

బ్రేక్‌ ఫాస్ట్‌ టేబుల్‌ దగ్గర సలహాలు ఎందుకు అని యూనిస్‌ అలా చేసి ఉండవచ్చు. అంతేకానీ కావాలని బెదిరింపులకు దిగలేదు’ అని పీసీబీ వర్గాలు స్పష్టం చేశాయి. మరొకవైపు పాక్‌ జట్టుతో పని చేసిన కోచ్‌లు కానీ, సపోర్టింగ్‌ స్టాఫ్‌ కానీ ఒకసారి తమ కాంట్రాక్ట్‌లు ముగిసిపోయిన తర్వాత గోప్యంగా ఉంచాల్సిన సమాచారాన్ని ఇలా బహిర్గతం చేయడాన్ని పీసీబీ తప్పుబట్టింది. ఇది వారికి తగదంటూ హితవు పలికింది. ఒక జట్టుకు కోచ్‌గా పని చేసి వెళ్లిపోయినప్పుడు ఎందుకు కొన్ని అంశాల్ని తెరపైకి తీసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పీసీబీలో ఒక సీనియర్‌ అధికారి వ్యాఖ్యానించారు. 

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌కు యూనిస్‌ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని గ్రాంట్‌ ఫ్లవర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌ జట్టు తరఫున బ్యాటింగ్‌ కోచ్‌గా ఉండగా  ఆసీస్‌ పర్యటనలో ఇది జరిగిందన్నాడు. బ్యాటింగ్‌లో సలహా ఇస్తుండగా ఏకంగా పీకపై కత్తి పెట్టాశాడని, ఇది నచ్చకే ఇలా చేసి ఉండవచ్చన్నాడు. ఈ ఘటనతో తాను షాక్‌కు గురైనట్లు ఫ్లవర్‌ తెలిపాడు. ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌ కలగజేసుకుని సముదాయించడన్నాడు. ఇది 2016 ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన విషయాన్ని ఫ్లవర్‌ తెలిపాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉంది. ఆగస్టు నెలలో ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌తోపాటు మూడు టీ20ల సిరీస్‌ జరుగనుంది. దీనికి పాక్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా చేయడానికి యూనిస్‌ ఖాన్‌ గతనెల్లో పీసీబీతో ఒప్పందం చేసుకున్నాడు.(యూనిస్‌ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్‌)

>
మరిన్ని వార్తలు