ప్రజ్నేశ్‌ మరో సంచలనం

11 Mar, 2019 01:24 IST|Sakshi

ప్రపంచ 18వ ర్యాంకర్‌పై గెలుపు

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టోర్నమెంట్‌లో భారత టెన్నిస్‌ నంబర్‌వన్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ మరో సంచలనం సృష్టించాడు. తన కెరీర్‌లో గొప్ప విజయాన్ని నమోదు చేశాడు. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించిన ఈ చెన్నై ప్లేయర్‌... పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ నికోలజ్‌ బాసిలాష్‌విలి (జార్జియా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఆదివారం 2 గంటల 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 97వ ర్యాంకర్, 29 ఏళ్ల ప్రజ్నేశ్‌ 6–4, 6–7 (6/8), 7–6 (7/4)తో బాసిలాష్‌విలిని ఓడించాడు.

తొలి రౌండ్‌లో ప్రపంచ 69వ ర్యాంకర్‌ బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్‌)పై ప్రజ్నేశ్‌ గెలిచిన సంగతి తెలిసిందే. గతేడాది çస్టుట్‌గార్ట్‌ ఓపెన్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్‌ డెనిస్‌ షపొవ లోవ్‌ (కెనడా)పై గెలుపొందడమే ప్రజ్నేశ్‌ కెరీర్‌లో సాధించిన గొప్ప విజయంగా ఉంది. బాసిలాష్‌విలితో జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ ఏకంగా పది ఏస్‌లు సంధించాడు. మరోవైపు బాసిలాష్‌విలి పది డబుల్‌ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మూడో రౌండ్‌లో ప్రపంచ 89వ ర్యాంకర్, 40 ఏళ్ల ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా)తో ప్రజ్నేశ్‌ తలపడతాడు.

బోపన్న జంట ముందంజ... 
ఇదే టోర్నీ పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–షపొవలోవ్‌ (కెనడా) ద్వయం 6–4, 6–4తో రెండో సీడ్‌ బ్రూనో సొరెస్‌ (బ్రెజిల్‌)–జేమీ ముర్రే (బ్రిటన్‌) జంటపై గెలిచింది. 

మరిన్ని వార్తలు