సైనా, ప్రణయ్‌... కాంస్యాలతో సరి 

29 Apr, 2018 01:15 IST|Sakshi

సెమీస్‌లో ముగిసిన భారత క్రీడాకారుల పోరాటం

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌

వుహాన్‌ (చైనా): ప్రతిష్టాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ (ఏబీసీ)లో తొలిసారి భారత్‌కు ఒకేసారి రెండు కాంస్య పతకాలు లభించాయి. మహిళల సింగిల్స్‌ విభాగంలో సైనా నెహ్వాల్‌... పురుషుల సింగిల్స్‌ విభాగంలో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ సెమీఫైనల్లో ఓటమి చవిచూసి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. సైనా, ప్రణయ్‌లకు 5,075 డాలర్ల చొప్పున ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షల 37 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

శనివారం జరిగిన సెమీఫైనల్లో సైనా 25–27, 19–21తో టాప్‌ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ తై జు యింగ్‌ చేతిలో సైనాకిది వరుసగా తొమ్మిదో ఓటమి కావడం గమనార్హం. 2013 స్విస్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో చివరిసారి తై జు యింగ్‌పై నెగ్గిన సైనా ఆ తర్వాత ఈ చైనీస్‌ తైపీ ప్లేయర్‌పై మరో విజయం నమోదు చేయలేదు. 55 ఏళ్ల చరిత్ర ఉన్న ఆసియా చాంపియన్‌షిప్‌లో సైనాకిది మూడో కాంస్య పతకం. గతంలో ఆమె 2010, 2016లలో కూడా సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలు గెల్చుకుంది. తై జు యింగ్‌తో 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో సైనాకు తొలి గేమ్‌లో నాలుగు గేమ్‌ పాయింట్లు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. రెండో గేమ్‌లో సైనా ఒక దశలో 19–17తో ఆధిక్యంలోకి వెళ్లినా మరోసారి ఒత్తిడికి తడబడి వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.  

పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రణయ్‌ 16–21, 18–21తో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ప్రణయ్‌కిది తొలి కాంస్య పతకం. ఓవరాల్‌గా టోర్నీ చరిత్రలో పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నాలుగో పతకం. 1965లో దినేశ్‌ ఖన్నా స్వర్ణం సాధించగా... 2000లో పుల్లెల గోపీచంద్, 2007లో అనూప్‌ శ్రీధర్‌ కాంస్య పతకాలు గెలిచారు.    

మరిన్ని వార్తలు