పృథ్వీ షా అరుదైన ఘనత

13 Oct, 2018 12:24 IST|Sakshi

హైదరాబాద్‌: వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌ ద్వారా టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పృథ్వీ షా తనదైన మార్కుతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.  తొలి టెస్టులో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుని తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు. దాంతో భారత్‌ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస‍్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే టెస్టుల్లో అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీతో మెరిశాడు.  మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అంతకుముందు సచిన్‌ టెండూల‍్కర్‌ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు.

మరొకవైపు టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్‌ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్‌ క్రికెటర్‌గా షా గుర్తింపు సాధించాడు. శిఖర్‌ ధావన్‌ 85 బంతుల్లో ఆసీస్‌పై సెంచరీ సాధించగా, డ్వేన్‌ స్మిత్‌ 93 బంతుల్లో శతకం సాధించిన ఆటగాడు. ఇక అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ సాధించిన నాల్గో పిన్నవయస‍్కుడిగా షా నిలిచాడు. ఇవన్నీ పృథ్వీ షా అరంగేట‍్రం మ్యాచ్‌లో సాధించిన ఘనతలు.

అయితే రెండో టెస్టులో పృథ్వీ షా మెరిసి అరుదైన ఘనత సాధించాడు.  టెస్టు కెరీర్‌లో తొలి రెండు ఇన్నింగ్స్‌లో యాభై, అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన ఎనిమిదో భారత ఆటగాడిగా షా గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో ఇప్పటివరకూ భారత్‌ తరఫున దిల్వార్‌ హుస్సేన్‌, క్రిపాల్‌ సింగ్‌, సునీల్‌ గావస‍్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌, సురేశ్‌ రైనా, రోహిత్‌ శర్మలు ఉండగా ఇప‍్పుడు వారి సరసన పృథ్వీ షా చేరాడు. రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా 39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో హాఫ్‌ సెంచరీ చేశాడు. కాగా, 70 వ్యక్తిగత పరుగులు సాధించిన తర్వాత షా రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పృథ్వీ షా(134) శతకం సాధించాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్‌ తేడాతో  విండీస్‌పై గెలవడంతో రెండో ఇన‍్నింగ్స్‌ ఆడే అవసరం రాలేదు.

కేఎల్‌ రాహుల్‌ తొమ్మిదో‘సారీ’

ఉమేశ్‌ విజృంభణ: విండీస్ ఆలౌట్‌

మరిన్ని వార్తలు