Ind Vs WI: వెస్టిండీస్‌కు షాకిచ్చిన ఐసీసీ.. విండ్సర్‌ పిచ్‌పై సీరియస్‌!

9 Sep, 2023 12:02 IST|Sakshi

India tour of West Indies, 2023 Test Series: వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి షాకిచ్చింది. ఇటీవల టీమిండియా- విండీస్‌ టెస్టు కోసం విండ్సర్‌ పార్కులో తయారు చేసిన పిచ్‌కు సగటు కంటే తక్కువ రేటింగ్‌ ఇచ్చింది. కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు భారత జట్ట జూలై- ఆగష్టులో కరేబియన్‌ దీవిలో పర్యటించిన విషయం తెలిసిందే.

స్పిన్నర్ల విజృంభణతో విండీస్‌ కుదేలు
ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జూలై 12న డొమినికాలోని రొసోవ్‌ వేదికగా తొలి టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి ఆతిథ్య వెస్టిండీస్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ 5, రవీంద్ర జడేజా 3 వికెట్లతో విండీస్‌ బ్యాటింగ్‌ పతనాన్ని శాసించారు.

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే వెస్టిండీస్‌ ఆలౌటైంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 421 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. తదుపరి లక్ష్య ఛేదనకు దిగిన కరేబియన్‌ జట్టు 130 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఇన్నింగ్స్‌ 141 పరుగుల భారీ తేడాతో ఓడింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు ఏడు, జడ్డూకు రెండు వికెట్లు దక్కాయి.

చెత్త పిచ్‌ అంటూ విమర్శలు
ఈ నేపథ్యంలో టర్నింగ్‌ పిచ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. మూడు రోజుల్లోనే మ్యాచ్‌ ముగియడంతో చెత్త పిచ్‌ అంటూ కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలో ఐసీసీ తాజాగా.. విండ్సర్‌ పిచ్‌కు బిలో ఆవరేజ్‌ రేటింగ్‌తో విండీస్‌ బోర్డును పనిష్‌ చేసింది. దీంతో వెస్టిండీస్‌ ఖాతాలో ఒక డిమెరిట్‌ పాయింట్‌ చేరింది. అయితే, ఈ విషయంపై బోర్డు అప్పీలు వెళ్లే అవకాశం ఉంది.

ఆ పిచ్‌కు రేటింగ్‌ ఇలా
ఇదిలా ఉంటే.. టీమిండియా- వెస్టిండీస్‌ మధ్య రెండో టెస్టుకు వేదికైన.. జమైకాలోని క్వీన్స్‌ పార్క్‌ ఓవల్‌కు ఆవరేజ్‌ రేటింగ్‌ ఇచ్చింది. ఇక వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ డ్రా కావడంతో భారత జట్టు 1-0తో సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. కాగా.. వన్డే సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం 3-2 తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.

చదవండి: పాక్‌ను ఓడించాలంటే అతడిపై వేటు పడాల్సిందే! లేదంటే..

మరిన్ని వార్తలు