‘ఆ విషయంలో ధోనికి పూర్తి స్వేచ్ఛ’

15 Feb, 2020 16:24 IST|Sakshi

ఇండోర్‌: ప్రస్తుత క్రికెట్‌లో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశం ‘ధోని రిటైర్మెంట్‌ ఎప్పుడు?’. టెస్టు క్రికెట్‌కు 2014లోనే వీడ్కోలు పలికిన ఎంఎస్‌ ధోని.. పరిమిత ఓవర్ల క్రికెట్‌ మాత్రమే ఆడుతున్నాడు. కాగా, ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ అనంతరం మళ్లీ ఇప్పటివరకు ధోని టీమిండియా జెర్సీ ధరించలేదు. కొంతకాలం ఆర్మీకి సేవలందించాలని కొన్ని నెలలు క్రికెట్‌కు దూరంగా ఉండగా.. ప్రస్తుతం సెలక్షన్స్‌కు స్వతహగా అతడే దూరంగా ఉంటున్నాడని బయట టాక్‌. దీంతో ధోని రిటైర్మెంట్‌ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) మాజీ ఛైర్మన్‌ రాజీవ్‌ శుక్ల ధోని గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘ధోని ఒక గొప్ప క్రికెటర్‌. సారథిగా, ఆటగాడిగా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అతడు ఇంకా చాలా క్రికెట్‌ ఆడాల్సి ఉంది. కానీ, రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం అతడి చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయంలో బీసీసీఐతో సహా మరొకరు జోక్యం చేసుకోలేరు. రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి స్వేచ్ఛను ప్రతీ ఒక్క క్రికెటర్‌కు బీసీసీఐ ఇచ్చింది. వారు తీసుకున్న నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతిస్తుంది తప్ప ఎలాంటి అభ్యంతరం చెప్పదు’అంటూ శుక్ల పేర్కొన్నాడు. ఇక ధోని భవిత్యం త్వరలో జరగబోయే ఐపీఎల్‌తో తేలనుందని క్రికెట్‌ పండితులు పేర్కొంటున్నారు. ఈ మెగా టోర్నీలో రాణించి ఈ ఏడాది చివర్లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోని టీమిండియా తరుపున ఆడతాడని అతడి ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

చదవండి:
పులిని పులి ఫొటో తీసింది..!
అందుకే ధోని బెస్ట్‌ కెప్టెన్‌

>
మరిన్ని వార్తలు