ఆడింది తొమ్మిదే.. ​కానీ ర్యాంకేమో

20 Jul, 2019 19:20 IST|Sakshi

హైదరాబాద్‌ : ‘9 టెస్టులు.. 2 శతకాలు.. 2 అర్దశతకాలు.. 696 పరుగులు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 15వ స్థానం. రిషభ్‌ పంత్‌ను టెస్టులకు ఎంపిక చేయడానికి ఇంకేమైనా గణాంకాలు కావాలా?’. సెలక్టర్లకు పంత్‌ అభిమానులు సంధిస్తున్న ప్రశ్న. వెస్టిండీస్‌ పర్యటన కోసం ఆదివారం సెలక్టర్లు భారత జట్టును ప్రకటించనున్నారు. అయితే గాయం నుంచి కోలుకున్న వృద్దిమాన్‌ సాహాను తిరిగి టెస్టులకు ఎంపిక చేస్తారనే ఊహాగానాలు రావడంతో పంత్‌ అభిమానులు ఈ విధంగా స్పందిస్తున్నారు. ‘ఆడింది తొమ్మిది టెస్టులే కానీ ర్యాంక్‌ 15. పంత్‌ ట్యాలెంట్‌ను ఐసీసీ గుర్తించింది.. మరి సెలక్టర్లు గుర్తిస్తారా’ అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
 

రిషభ్‌ పంత్‌ టీమిండియా తరుపున ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో తొలి శతకం సాధించి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. అయితే దురదృష్టవశాత్తు చివర్లో అవుటవ్వడంతో కోహ్లి సేన ఓటమిపాలైంది. ఇక ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 350 పరుగులు చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక వన్డేలు కూడా తొమ్మిది ఆడిన పంత్‌ అంతగా ఆకట్టుకోలేదు. విండీస్‌ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటన కోసం భారత జట్టును ఎంపిక చేసేందుకు ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆదివారం సమావేశం కానుంది.   

మరిన్ని వార్తలు