పంత్‌ సూపర్‌ ఫాస్ట్‌

14 Jan, 2018 15:36 IST|Sakshi

32 బంతుల్లో సెంచరీ చేసిన ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ 

టి20ల్లో గేల్‌ తర్వాత రెండో స్థానం 

భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీ 

ఢిల్లీ యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముస్తాక్‌ అలీ టి20 టోర్నీలో భాగంగా హిమాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32 బంతుల్లోనే అతను సెంచరీ సాధించాడు. ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌ తరఫున ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌ జాబితాలో పంత్‌ శతకం రెండో స్థానంలో నిలిచింది. గతంలో క్రిస్‌ గేల్‌ ఐపీఎల్‌లో 30 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (35 బంతుల్లో) చేసిన శతకాన్ని మూడు బంతుల తేడాతో రిషభ్‌ సవరించాడు.

న్యూఢిల్లీ:  వారం క్రితమే రిషభ్‌ పంత్‌ను ఢిల్లీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. దానికి తానేమీ కుంగిపోలేదని... చేతల్లో చూపెట్టాడు. వేగవంతమైన చరిత్రలో భాగమయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 ట్రోఫీలో పంత్‌ (38 బంతుల్లో 116 నాటౌట్‌; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్స్‌తో క్రిస్‌ గేల్‌ను తలపించాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. భారత్‌ తరఫున వేగవంతమైన రికార్డుకు వేదికైన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో హిమాచల్‌ ప్రదేశ్‌పై ఘనవిజయం సాధించింది. 

ఆదివారం ఫిరోజ్‌ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్‌ సాంగ్వాన్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ తరఫున రిషభ్‌ పంత్‌ సిక్సర్ల జడివాన కురిపించాడు. దీంతో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్‌ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన పంత్‌ 18 బంతుల్లో అర్ధసెంచరీని, మరో 14 బంతుల్లో  సెంచరీని పూర్తిచేశాడు.  పంత్‌ కంటే ముందు వరుసలో ఒకే ఒక్కడు గేల్‌ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై బెంగళూరు తరఫున గేల్‌ ఈ ఘనత సాధించాడు.  

కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌కు ఉద్వాసన

మరిన్ని వార్తలు