నా కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్‌ చేశారు: రిషభ్‌

17 Jan, 2019 15:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో రిషభ్‌ పంత్‌-టిమ్‌ పైన్‌ల మధ్య సాగిన స్లెడ్జింగ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆసీస్‌ టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ ఒకటంటే అందుకు మరింత ఘాటుగా రిప్లే ఇచ్చి సిరీస్‌కే హైలైట్‌గా నిలిచాడు రిషభ్‌. ఆస్ట్రేలియా క్రికెటర్లను మించిపోయి మరీ రిషభ్ పంత్‌ స్లెడ్జింగ్‌ చేయడం అభిమానుల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.  పైన్‌తో పాటు ప్యాట్‌ కమిన్స్‌, నాథన్‌ లయన్‌లను సైతం తన స్లెడ్జింగ్‌తో తిప్పికొట్టాడు రిషభ్‌.

అయితే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైన రిషభ్‌.. ఇప్పుడు కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. దీనిలో భాగంగా ఆసీస్‌ క్రికెటర్లపై స్లెడ్జింగ్‌ చేయడాన్ని రిషభ్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తన స్లెడ్జింగ్‌ను కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్‌ చేసినట్లు రిషభ్‌ తాజాగా చెప్పుకొచ్చాడు. ‘నేను నా జట్టు కోసం ఏమి చేయాలో అది చేశా. నన్ను ఎవరైనా టార్గెట్‌ చేస్తే అంతే గట్టిగా బదులివ్వాలనుకున్నా. ఇక్కడ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నియమాన్ని కూడా మరిచిపోలేదు. నిబంధనలకు లోబడే స్లెడ్జింగ్‌కు పాల్పడ్డా. ఎక్కడా శృతి మించకుండానే నా నోటికి పనిచెప్పా. నా స్లెడ్జింగ్‌ను అభిమానులు కూడా ఇష్టపడ్డారు. నా స్లెడ్జింగ్‌ను ఇష్టపడ్డ వారిలో కుటుంబ సభ్యులు  ఉన్నారు. ప్రధానంగా నా తల్లి, నా సోదరి సైతం నేను స్లెడ్జింగ్‌ చేసిన విధానాన్ని బాగా ఎంజాయ్‌ చేశారు’ అని రిషభ్‌ అన్నాడు.

తాను ఆదర్శంగా తీసుకునే వారిలో ఆడమ్‌ గిల్‌క్రిస్‌, ఎంఎస్‌ ధోనిలు ముందు వరుసలో ఉంటారని పేర్కొన్న రిషభ్‌.. అలా అని వారిని తాను కాపీ కొట్టనని పేర్కొన్నాడు. తాను తనలా ఉంటూనే వారి నుంచి కొన్ని విషయాలను నేర్చుకుంటానని తెలిపాడు.

>
మరిన్ని వార్తలు